CBI Employees Arrested
ఒకపక్క దేశవ్యాప్తంగా ఎన్నికల వేడి రగులుకుంటే మరోపక్క పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వానికి ,కేంద్ర ప్రభుత్వానికి మధ్య విబేధాలు తారాస్థాయికి చేరాయి. రాజ్యాంగ సంక్షోభం దిశగా ఆ రాష్ట్రంలో పరిస్థితులు మారుతున్నాయి. శారదా చిట్ ఫండ్ కుంభకోణం కేసులో ప్రమేయముందన్న ఆరోపణలపై కోల్ కతా పోలీస్ కమిషనర్ రాజీవ్ కుమార్ ను అదుపులోకి తీసుకునేందుకు ఈ సీబీఐ అధికారులు వచ్చారు. దీంతో పోలీసులు సీబీఐ అధికారులను అదుపులోకి తీసుకున్నారు. తమకు వారంట్ చూపించాలని పోలీసులు నిలదీశారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
శారదా – రోజ్ వ్యాలీ పొంజీ కుంభకోణంలో కోల్ కతా పోలీస్ కమిషనర్ రాజీవ్ కుమార్ ను ప్రశ్నించేందుకు సీబీఐ సిద్ధమైంది. కుంభకోణం కేసులో రాజీవ్ పరారీలో ఉన్నట్లు సీబీఐ ఆరోపిస్తోంది. కుంభకోణం కేసును రాజీవ్ కుమార్ దర్యాప్తు చేస్తున్నారు. కేసులో మాయమైన కొన్ని పత్రాల విషయమై రాజీవ్ ను ప్రశ్నించాల్సి ఉందని సీబీఐ చెబుతోంది. సీబీఐ ఎదుట హాజరుకావాలని నోటీసులు పంపించినా స్పందించలేదని దర్యాప్తు సంస్థ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో సీబీఐ అధికారులు కోల్ కతా సీపీ రాజీవ్ కుమార్ ఇంటికి వచ్చారు. ఈ సమయంలో ఉద్రిక్తత నెలకొంది. సీబీఐ అధికారులను పశ్చిమ బెంగాల్ పోలీసులు అడ్డుకున్నారు. రాజీవ్ కుమార్ నివాసానికి వచ్చిన సీబీఐ అధికారులను కోల్కతా పోలీసులు పోలీస్ స్టేషన్ కు తరలించారు. కొందరు అధికారులను షేక్ స్పియర్ సరాని పోలీస్ స్టేషన్ కు తరలించారు.
విషయం తెలుసుకున్న బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కోల్ కతాలోని రాజీవ్ నివాసానికి వెళ్లారు. కోల్ కతా మేయర్ ఫర్హద్ హకీం – బెంగాల్ డీజీపీ తదితరులు కూడా రాజీవ్ నివాసానికి వెళ్లారు. మమతతో పాటు పలువురు రాజీవ్ నివాసంలో సమావేశమైనట్లు తెలిసింది. కోల్ కతాలోని సీబీఐ రీజియనల్ ఆఫీస్ ముందు కోల్కతా పోలీస్ లను మోహరించారు. విధుల పట్ల రాజీవ్ నిర్లక్ష్యం వహించారన్న సీబీఐ ఆరోపణలను కోల్ కతా పోలీసులు ఖండించారు. మొత్తానికి ఈ వివాదం ఏ రూపు తీసుకుంటుందో వేచి చూడాలి