సీబీఐ కొత్త బాస్ గా రిషికుమార్ శుక్లా

CBI NEW CHIEF SUKHLA

  • ఎంపిక చేసిన ప్రధాని నేతృత్వంలోని కమిటీ

ఎట్టకేలకు కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) నియామకం పూర్తయింది. సీబీఐ కొత్త డైరెక్టర్ గా మధ్యప్రదేశ్ డీజీపీగా పనిచేసిన 1983 బ్యాచ్ ఐపీఎస్ అధికారి రిషికుమార్ శుక్లా నియమితులయ్యారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని అత్యున్నత ఎంపిక కమిటీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఈ కమిటీలో ప్రధాని మోదీతోపాటు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయ్, లోక్ సభలో ప్రతిపక్ష నేత మల్లిఖార్జున్ ఖర్గే ఉన్నారు. అయితే, శుక్లా నియామకాన్ని ఖర్గే వ్యతిరేకించినప్పటికీ.. ప్రధాని, సీజేఐ శుక్లా వైపు మొగ్గు చూపడంతో 2-1 తేడాతో ఆయన నియామకం ఖరారైంది. శుక్లా నియామకాన్ని కేబినెట్‌ నియామకాల కమిటీ ఆమోదించింది. ఆయన రెండేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగనున్నారు. వాస్తవానికి ఈ పోస్టుకు 1984 బ్యాచ్‌కు చెందిన జావేద్ అహ్మద్, రజనీ కాంత్ మిశ్రా, ఎస్‌ఎస్‌ దేశ్వాల్ పేర్లు కూడా వినిపించాయి. అయితే, ప్రధాని మోదీ శుక్లా వైపు మొగ్గు చూపడంతో ఇక ఆయన నియామకం పూర్తయింది.

వరుస వివాదాలతో మసకబారిన సీబీఐకి పూర్వ వైభవం తీసుకురావడం, మళ్లీ సంస్థపై ప్రజల్లో విశ్వసనీయత నెలకొల్పడం కొత్త డైరెక్టర్ ముందు ఉన్న తక్షణ సవాళ్లు. కాగా, గత నెల 24న ఢిల్లీలో ప్రధాని మోదీ నివాసంలో జరిగిన సెలక్షన్‌ కమిటీ మొదటి సమావేశం ఏ నిర్ణయం తీసుకోకుండానే అసంపూర్ణంగా ముగిసింది. దీంతో రెండో సమావేశంలో నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. అంతకుముందు సీబీఐ డైరెక్టర్‌గా అలోక్‌ వర్మను తప్పించి ఆయన స్థానంలో తాత్కాలికంగా నాగేశ్వరరావును నియమించిన సంగతి తెలిసిందే. రాకేశ్‌ ఆస్థానాతో విభేదాల కారణంగా అలోక్‌ వర్మ పదవి కోల్పోయారు. అయితే దేశ అత్యున్నత దర్యాప్తు సంస్థ(సీబీఐ)ను తాత్కాలిక డైరెక్టర్‌తో నడిపించడంపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే పూర్తి స్థాయి డైరెక్టర్‌ను నియమించాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో శనివారం ప్రధాని నేతృత్వంలోని కమిటీ సమావేశమై శుక్లాను సీబీఐ కొత్త డైరెక్టర్ గా ఎంపిక చేసింది.

NATIONAL NEWS

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article