గాంధీలాంటోడిని.. నాపైనే ఆరోపణలా?

CBN REACTS TO MODI

  • ప్రధాని మోదీపై చంద్రబాబు ధ్వజం

గుంటూరు వేదికగా ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రంగా మండిపడ్డారు. మహాత్మాగాంధీలా చాలా సాదాసీదా జీవితం గడుపుతున్న తనపైనే అవినీతి ఆరోపణలు చేస్తారా? అని ప్రశ్నించారు. మోదీ రోజూ రూ.కోట్ల విలువైన సూటు బూట్లు వేసుకుంటారని, తాను మాత్రం గాంధీలా చాలా సాదాసీదాగా ఉంటానని పేర్కొన్నారు. విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో చంద్రబాబు మాట్లాడారు. 40 ఏళ్లుగా ఒకే రకం బట్టలు వేసుకుంటున్నానని, ఎక్కడకు వెళ్లినా వేషం మార్చడం లేదని, సూట్లు వేసుకోవడం లేదని, ఈ రోజు ప్రజల కోసం నల్ల చొక్కా వేసుకున్నానని చెప్పారు. రాజకీయ గురువుకు పంగనామాలు పెట్టిన ప్రధాని మోదీ.. తనను సొంతమామకు వెన్ను పోటు పొడిచానని విమర్శించడం సరికాదన్నారు. మోదీ రాజకీయ ఎదుగుదలకు సాయపడింది ఎల్‌కే అద్వానీ అని, గోద్రా అల్లర్ల అనంతరం మోదీని ముఖ్యమంత్రిగా తప్పించాలని వాజ్‌పేయ్‌ ప్రతిపాదించగా.. అద్వానీయే కాపాడారని బాబు పేర్కొన్నారు. చివరకు గురువుకే మోదీ పంగనామాలు పెట్టారని ఎద్దేవా చేశారు.

అమరావతి అభివృద్ధిని చూసి మోదీ అసూపడుతున్నారని బాబు విమర్శించారు. ‘గుజరాత్‌ను ఆంధ్రప్రదేశ్‌ మించిపోతుందని మీకు అసూయ ఉండొచ్చు. మాకు డబ్బులు ఇవ్వమని కోరితే  నేను లెక్కలు చెప్పలేదంటున్నారు. నేను లెక్కలు చెప్పను.. మా సీఐజీ మాత్రమే చెబుతుంది’ అని పేర్కొన్నారు. మోదీని ఇంటికి పంపి రాష్ట్ర హక్కులు సాధించుకునే వరకు పోరాడతానని స్పష్టంచేశారు. లోకేష్‌ తండ్రి చంద్రబాబు అని మోదీ అభివర్ణించడాన్ని విమర్శించారు. మోదీకి కుటుంబ వ్యవస్థపై గౌరవం లేదని దుయ్యబట్టారు. ప్రధానిది ప్రచార యావ అని, చేతల మనిషి కాదని ఆరోపించారు. నోట్ల రద్దు పిచ్చి తుగ్లక్ చర్య అని అభివర్ణించారు.

AP POLITICS

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article