CBN WANTS PAVAN SUPPORT
- జనసేన అధినేతతో సంప్రదింపులు షూరూ
గత ఎన్నికల్లో తాము అధికారంలోకి రావడానికి సాయం చేసిన జనసేన అధినేతను ఎలాగైనా తమ వైపు తిప్పుకునేందుకు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ప్రయత్నాలు ప్రారంభించారా? పార్టీ నుంచి వరుసగా వెల్లువెత్తుతున్న వలసలు ఓ వైపు.. రోజురోజుకు పెరుగుతున్న వైఎస్సార్ సీపీ గ్రాఫ్ మరోవైపు ఆయనకు నిద్ర పట్టనివ్వడంలేదా? ఈ నేపథ్యంలో అధికారాన్ని నిలుపుకోవడం కోసం పవన్ మద్దతు కోరుతున్నారా? అంటే ఔననే అంటున్నారు. గత ఎన్నికలలో పవన్ కల్యాణ్ తోడవడంతో పాటు భారతీయ జనతా పార్టీ కూడ పొత్తు కుదుర్చుకోవడం వల్ల చంద్రబాబు అధికారంలోకి వచ్చారు. అయితే, నాలుగున్నరేళ్ల తెలుగుదేశం పాలనపై ప్రజలలో తీవ్ర అసంతృప్తి నెలకొనడంతో వారు ప్రత్యామ్నాయం వైపు దృష్టి సారించిన పరిస్థితులు కనిపిస్తున్నాయని పలు సర్వేల్లో వెల్లడైంది. పైగా పార్టీ నుంచి వైఎస్సార్ సీపీలోకి వలసలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో అధికారాన్ని నిలుపుకోవడం కోసం బాబు అందివచ్చే ఏ మార్గాన్ని వదులుకునేందుకు సిద్ధంగా లేరని అంటున్నారు. అవసరమైతే మరోసారి పవన్ మద్దతు తీసుకోవాలని యోచిస్తున్న ఆయన.. ఇందుకు సంబంధించి ప్రయత్నాలు ప్రారంభించారని సమాచారం.
ఇందులో భాగంగా పవన్ కల్యాణ్ కు సినీ పరిశ్రమలో అత్యంత దగ్గరైన వారి చేత, ఒకరిద్దరు మీడియా అధిపతుల ద్వారా మాట్లాడించాలని వ్యూహరచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఓ పెద్ద దర్శకుడు, ఎలక్ట్రానిక్ మీడియాకు చెందిన ఒక అధిపతి పవన్ తో తొలివిడత చర్చలు జరిపినట్టు సమాచారం. చర్చలు ఫలితాలు ఏమిటనేది బయటకు రాలేదు. గత ఎన్నికల తరహాలోనే పవన్ మళ్లీ చంద్రబాబుకు జై కొడతారా? లేక గత అనుభవం దృష్ట్యా తిరస్కరిస్తారా అనేది త్వరలోనే తేలనుంది.