హైదరాబాద్ శివార్లలో వెటర్నరీ డాక్టర్ దారుణ హత్యపై తెలంగాణ సీఎం కేసీఆర్ మూడు రోజుల తర్వాత స్పందించారు. ఆర్టీసీ కార్మికులతో జరిగిన ఆత్మీయ సమావేశంలో కేసీఆర్ జరిగిన ఘాతుకాన్ని ప్రస్తావించి ఆవేదన చెందారు. ఇది అమానుషమైన దుర్ఘటన అని అన్నారు. మానవమృగాలు మనమధ్యే తిరుగుతున్నాయన్నారు. అన్ని వేళలా అప్రమత్తంగా ఉండాలన్నారు. ఆడబిడ్డలను కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉందన్నారు. ఈ ఘటనపై ఆవేదన వ్యక్తం చేసిన కేసీఆర్….కేసును అత్యంత వేగంగా విచారించి దోషులకు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కేసు సత్వర విచారణ కోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీనికి సంబంధించిన ప్రక్రియ ప్రారంభించాలని సీఎం అధికారులను కోరారు. ఇక బాధిత కుటుంబానికి అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఈ మాత్రం సీఎం స్పందించటానికి మూడు రోజుల సమయం పట్టిందని అంటున్నారు ప్రజలు .
కేసీఆర్ స్పందించటానికి జాతీయ మీడియా ఒత్తిడే కారణం

central media pressure on cm kcr about veterinary doctor disha
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ సామూహిక అత్యాచారం మరియు హత్య కేసులో సీఎం కేసీఆర్ ఎట్టకేలకు స్పందించారు. దిశా గ్యాంగ్ రేప్ మరియు హత్య జరిగి మూడు రోజులైనా సీఎం కేసీఆర్ ఈ ఘటనపై స్పందించకపోవడంతో దేశం మొత్తం భగ్గుమంది. అటు దిశ కుటుంబ సభ్యులు కూడా సీఎం స్పందించకపోవటంపై ఆగ్రహం వ్యక్తం చేసారు. కాలనీ వాసులు సీఎం స్పందించాలని కాలనీ గేట్లకు తాళాలు వేసి మరీ ఆందోళన చేశారు . సానుభూతి వద్దు , న్యాయం కావాలని నినదించారు. ఇక జాతీయ మీడియా సీఎం కేసీఆర్ పై దుమ్మెత్తిపోసింది. ఎందుకు సీఎం కేసీఆర్ ఘటనపై స్పందించలేదని భగ్గుమంది . ఇక జాతీయ మీడియా ఒత్తిడితోనే సీఎం కేసీఆర్ ఈ ఘటనపై స్పందించినట్లు తెలుస్తోంది.