బుమ్రాకు విశ్రాంతి.. సిరాజ్ కు ఛాన్స్

Chance for Seraj and rest for Bumra

  • ఆసీస్ తో వన్డేలకు జట్టు ఎంపిక
  • కివీస్ పర్యటనలో టీ20లకు సిద్ధార్థ్ కౌల్

ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్ ను గెలుచుకుని చరిత్ర సృష్టించిన టీమిండియా అదే ఉత్సాహంతో వన్డే సమరానికి సన్నద్దమవుతోంది. జనవరి 12 నుంచి ఆసీస్ తో మూడు వన్డేలు ఆడనున్న నేపథ్యంలో బీసీసీఐ వన్డే జట్టును ప్రకటించింది. టెస్టు సిరీస్‌ విజయంలో కీలక పాత్ర పోషించిన పేసర్‌ జస్ప్రీత్ బుమ్రాకు తదుపరి మ్యాచ్‌ల్లో విశ్రాంతినిచ్చింది. ఆస్ట్రేలియాతో జరగబోయే వన్డే మ్యాచ్‌లు, న్యూజిలాండ్‌ పర్యటనలో బుమ్రా స్థానంలో హైదరాబాద్‌ కుర్రాడు మహ్మద్‌ సిరాజ్‌కు అవకాశం కల్పించింది. ‘తర్వాతి సిరీస్‌లను దృష్టిలో పెట్టుకుని ప్రస్తుతం బుమ్రాకు విశ్రాంతి ఇవ్వడమే మంచిదని భావించాం. ఆస్ట్రేలియాతో వన్డే మ్యాచ్‌లు, న్యూజిలాండ్‌ పర్యటనలో బుమ్రా స్థానంలో మహ్మద్‌ సిరాజ్‌ ఆడుతాడు’ అని బీసీసీఐ ఓ ప్రకటనలో తెలిపింది. కేవలం 12 నెలల క్రితమే టెస్టుల్లో అరంగేట్రం చేసిన బుమ్రా.. ప్రస్తుతం కీలక పేసర్‌గా మారిపోయాడు. ఆసీస్‌తో జరిగిన నాలుగు టెస్టుల సిరీస్‌లో 21 వికెట్లు తీసి సత్తా చాటాడు. ఇక గతేడాది మార్చిలో బంగ్లాదేశ్ తో జరిగిన టీ20 మ్యాచ్ లో కనిపించిన హైదరాబాద్ పేసర్ మహ్మద్ సిరాజ్ కు తాజాగా అవకాశం వచ్చింది. ఇప్పటివరకూ అంతర్జాతీయ టీ20లు మాత్రమే ఆడిన సిరాజ్‌.. ఆసీస్‌తో వన్డే ఫార్మాట్‌లో అరంగేట్రం చేయనున్నాడు. న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు సిద్ధార్ధ్‌ కౌల్‌కు అవకాశం వచ్చింది. ఆసీస్ తో వన్డే సిరీస్ ముగిసిన తర్వాత ఐదు వన్డేలు, మూడు టీ20లు ఆడేందుకు టీమిండియా న్యూజిలాండ్‌ బయల్దేరుతుంది. జనవరి 23 నుంచి న్యూజిల్యాండ్‌ సిరీస్‌ ప్రారంభం కానుంది.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article