చంద్రబాబు ఫోకస్ పెంచడంతో తమ్మళ్లలో జోష్
ప్రతినెలా రెండో శనివారం రాష్ట్రానికి బాబు
తెలంగాణలో తెలుగుదేశానికి పూర్వవైభవం తీసుకొస్తాం… మళ్లీ పచ్చజెండాను రెపరెపలాడిస్తాం… ఇదీ, టీడీపీ అధినేత చంద్రబాబు ఎప్పుడూ చెప్పే మాట. లక్షల మంది కార్యకర్తల ఆకాంక్షకూడా అదే. మరి, ఆ సమయం ఆసన్నమైందా? పదేళ్లుగా నిస్తేజమైన టీటీడీపీ… మళ్లీ ఉత్తేజితం కాబోతోందా? ప్రస్తుతం ఉన్న అన్ని పదవులూ రద్దుచేసి… సరికొత్తగా పార్టీని నిర్మించేందుకు రంగం సిద్ధమవుతోందా? తెలంగాణ గట్టుమీద ఇప్పుడిదే చర్చ జరుగుతోంది.
తెలంగాణ గడ్డమీద పుట్టిన తెలుగుదేశం పార్టీ… ఇప్పుడా తెలంగాణలోనే కనుమరుగయ్యే పరిస్థితికి చేరుకుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో… బడుగుబలహీన వర్గాల పార్టీగా ఇచ్చాపురం నుంచి ఆదిలాబాద్ వరకు సత్తాచూపిన తెలుగుదేశం, రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో ఫేడయిపోయింది. ఒక్కసారిగా పరిస్థితులు తారుమారయ్యాయి. 2014 ఎన్నికల్లో ఎన్డీఏ కూటమితో పోటీచేసి.. గ్రేటర్‌లో కీలక స్థానాలను కైవసం చేసుకున్న టీడీపీ, ఆ తర్వాత మెల్లమెల్లగా సైడైపోయింది. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్‌తో జట్టుకట్టి… తెలంగాణలో ఒకట్రెండు స్థానాలు గెలిచినా, పార్టీ మరింత బలపడింది. క్యాడర్ మొత్తం చెల్లాచెదురైపోయింది.
ఉమ్మడి రాష్ట్రంలో, ఏకో నాయకుడు చంద్రబాబు కింద నడిచిన టీడీపీలో… విభజన తర్వాత తెలంగాణకు కూడా ప్రత్యేక శాఖను ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందుకే తెలంగాణ రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడిగా సీనియర్ నేత ఎల్ రమణను నియమించారు చంద్రబాబు. 2014ఎన్నికల్లో ఏపీలో అధికారంలోకి వచ్చినా… తెలంగాణలో మాత్రం అనుకున్న ఫలితాలు రాబట్టలేదు టీడీపీ. అప్పట్నుంచీ మెల్లగా ఇక్కడి ఎన్నికల క్షేత్రం నుంచి సైడవుతూ వచ్చింది. 2018ఎన్నికల తర్వాత పరిస్థితి మరింత ఘోరంగా మారింది తెలంగాణలో టీడీపీ పరిస్థితి. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ఉన్న ఎల్ రమణ.. బీఆర్‌ఎస్‌లో చేరడంతో తెలుగు తమ్ముళ్లకు పెద్ద షాక్ తగిలింది. అనంతరం, పార్టీ సీనియర్ నేత బక్కని నర్సింలుకు.. తెలంగాణ బాధ్యతలు అప్పగించారు చంద్రబాబు.
బక్కని నర్సింలు సారథ్యంలోనూ పార్టీకి పెద్దగా కలిసిరాలేదు. 2019 ఎన్నికల్లో ఏపీలోనూ టీడీపీ అధికారం కోల్పోవడం… తెలంగాణలో పార్టీని మరింత బలహీనపరిచిందని చెప్పొచ్చు. కరుడుగట్టిన కార్యకర్తలు ఉన్నా.. నడిపించే నాయకులే లేకపోవడంతో, పార్టీ ఉన్నా లేనట్టుగా తయారైంది. 2023 ఎన్నిలకు ముందు.. బీసీ నేత కాసాని జ్ఞానేశ్వర్‌కు పార్టీపగ్గాలు అప్పగించారు చంద్రబాబు. అయితే, అది కూడా మూణ్నాళ్ల ముచ్చటే అయ్యింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేయొద్దని అధిష్టానం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ… తన పదవికి రాజీనామా చేసి, బీఆర్‌ఎస్ కండువా కప్పేసుకున్నారు కాసాని జ్ఞానేశ్వర్. రాష్ట్ర పార్టీ అధ్యక్షులే.. కండువాలు మార్చేయడం టీటీడీపీని కోలుకోలేని దెబ్బకొట్టేసిందని చెప్పొచ్చు.
పోలిట్ బ్యూరోలోనూ టీటీడీపీపై చర్చ!
పదేళ్లుగా ఇన్ని డక్కా ముక్కీలు తింటూ కూడా… తెలంగాణలో సజీవంగా ఉన్న తెలుగుదేశం పార్టీకి, ఇప్పుడు మళ్లీ టైమొచ్చినట్టే కనిపిస్తోంది. 2024ఎన్నికల్లో.. ఏపీని బంపర్ మెజార్టీతో చేజిక్కించుకుంది టీడీపీ కూటమి. దీంతో, పక్కనే ఉన్న తెలంగాణలోనూ జోష్ నింపుకొంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు తెలుగు తమ్ముళ్లు. ఆ దిశగా చంద్రబాబు కూడా ప్రయత్నాలు మొదలెట్టినట్టు తెలుస్తోంది. నవ్యాంధ్రకు రెండోసారి ముఖ్మమంత్రి అయ్యాక… గ్రాండ్‌గా హైద్రాబాద్‌లోకి ఎంట్రీ ఇచ్చిన చంద్రబాబు.. ఎన్టీఆర్ ట్రస్ట్‌భవన్‌లో పార్టీనేతలతో మంతనాలు కూడా జరిపారు. ఇటీవల జరిగిన పార్టీ పొలిట్‌బ్యూరో మీటింగ్‌లోనూ… తెలంగాణలో బలోపేతం కోసం తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.
ట్రస్ట్ భవన్‌లో పార్టీ నేతలు, కార్యకర్తలతో బాబు భేటీ!
తెలంగాణలో ఇప్పటికీ టీడీపీ ఓటు బ్యాంక్ బలంగా ఉందన్నది చంద్రబాబు విశ్వాసం. అందుకే, పార్టీకి పూర్వవైభవం తీసుకురావడంపై ఫోకస్ పెట్టిన ఆయన, మరోసారి ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో కీలక సమావేశం నిర్వహించారు. పార్టీ నేతలు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్లాలనే అంశంపై.. దిశానిర్దేశం చేశారు.
ఏపీలో మరోసారి టీడీపీ అధికారంలోకి రావడంతో…. తెలంగాణలో ఆ పార్టీ అభిమానులు ఇప్పటికే ఫుల్‌జోష్‌లో ఉన్నారు. ఇప్పుడు అధినేత కూడా ఫోకస్ పెంచడంతో.. రాష్ట్రంలో పార్టీకి పూర్వవైభవం ఖాయం అనే ధీమాతో ఉన్నారు. మరి, తెలంగాణలో టీడీపీకి మహర్దశ పడుతుందా? మరోసారి ప్రభంజనం సృష్టిస్తుందా? అన్నది చూడాలి.