అమిత్ షా వ్యాఖ్యలకు చంద్రబాబు ఘాటు సమాధానం

ChandraBabu Counter for Amit Shah Comments

ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుకి ఎన్డీయే శాశ్వ‌తంగా త‌లుపులు మూసేసింద‌ని భాజ‌పా అధ్య‌క్షుడు అమిత్ షా వ్యాఖ్యానించిన సంగ‌తి తెలిసిందే. ఈ విమ‌ర్శ‌ల‌పై ఢిల్లీలో ఉన్న సీఎం చంద్ర‌బాబు నాయుడు స్పందించారు. ఆయ‌న్నేదో డోర్లు ఓపెన్ చేయాలంటూ అడుక్కుంటున్న‌ట్టు అమిత్ షా మాట్లాడుతున్నార‌నీ, అడుక్కునేవారు ఎవ్వ‌రూ ఇక్క‌డ లేర‌ని ఘాటుగా స‌మాధాన‌మిచ్చారు. 2014 ఎన్నిక‌ల స‌మ‌యంలో ఎవ‌రు ఎవ‌రి ద‌గ్గ‌ర‌కు వ‌చ్చి అడుక్కున్నారో అమిత్ షా గుర్తుచేసుకోవాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. ఇచ్చిన మాట నిల‌బెట్టుకోకుండా న‌మ్మ‌క ద్రోహం చేసిన పార్టీ ఈ బీజేపీ అన్నారు. త్వ‌ర‌లోనే వీళ్ల డోర్ల‌ను ప్ర‌జ‌లే క్లోజ్ చేసే ప‌రిస్థితి వ‌స్తుంద‌ని చంద్ర‌బాబు అభిప్రాయ‌ప‌డ్డారు.
2014 కంటే ముందు అమిత్ షా ఎక్క‌డున్నార‌ని సీఎం చంద్ర‌బాబు ప్ర‌శ్నించారు. ఢిల్లీలో ఉన్నారా, అధికారంలో ఉన్నారా, ఆయ‌న చ‌రిత్ర ఏంటి… ఇలాంటి విష‌యాల‌న్నీ చెప్పాలంటే చాలానే ఉన్నాయ‌న్నారు. స‌రైన స‌మ‌యంలో ఆ చ‌రిత్ర గురించి మాట్లాడతా అన్నారు చంద్ర‌బాబు. గౌర‌వం ఇచ్చి పుచ్చుకోవ‌డం నేర్చుకోవాల్సిన అవ‌స‌ర‌ముంద‌నీ, ఇష్టానుసారంగా మాట్లాడితే తెలుగు జాతి వినేందుకు సిద్ధంగా లేద‌న్నారు. రాష్ట్రానికి మీరేం చేశార‌ని తెలుగు ప్ర‌జ‌లు నిల‌దీస్తున్నార‌నీ, దానికి స‌మాధానం చెప్ప‌కుండా ఏదో చేశాన‌ని ఎటాక్ చేసేలా బెదిరించే ధోర‌ణి చూపిస్తే ఇక్క‌డ ఎవ్వ‌రూ భ‌య‌ప‌డ‌ర‌ని ముఖ్య‌మంత్రి అన్నారు. వారికి తోడుగా ఒక అవినీతి పార్టీ ఉంద‌ని ధీమాగా ఉన్న‌ట్టున్నార‌నీ, ఆ పార్టీతోనే ముందుకెళ్లండనీ, ఇచ్చిన మాట‌ను నిల‌బెట్టుకోలేక‌పోయారనీ అందుకే తిరుగుబాటు చేస్తున్నామ‌ని ముఖ్య‌మంత్రి చెప్పారు.
కోల్ కతా ప‌రిణామాల గురించి చంద్ర‌బాబు మాట్లాడుతూ… రాజ్యాంగబ‌ద్ధ సంస్థ‌ల‌న్నింటినీ నిర్వీర్యం చేస్తున్నార‌నీ, సీనియ‌ర్ నాయ‌కుల్ని వేధించే ప‌రిస్థితి వ‌స్తే ఎక్క‌డికి పోవాల‌ని ప్ర‌శ్నించారు. ప్ర‌జాస్వామ్య వాదులంతా ఈ తీరుపై స్పందించాల్సిన అవ‌స‌రం ఉంద‌నీ, ఎక్క‌డిక‌క్క‌డ తిరుగుబాటు చేస్తే త‌ప్ప‌, వీళ్లు నియంత్ర‌ణ‌లో ఉండ‌ర‌న్నారు. ఇంకో నెల మాత్ర‌మే వీళ్ల‌కి (భాజ‌పా) స‌మ‌యం ఉంద‌నీ, ప్ర‌జ‌లే వీళ్ల డోర్లు క్లోజ్ చేస్తార‌న్నారు. ఇలాంటి చ‌ర్య‌ల‌కు పాల్ప‌డితే భ‌య‌పెట్టొచ్చ‌ని అనుకుంటున్నార‌నీ, కానీ ప్ర‌జ‌లు తిర‌గ‌బ‌డ‌తార‌ని గుర్తించాల‌నీ, ఇది మంచి ప‌ద్ధ‌తి కాద‌ని హిత‌వు ప‌లికారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article