వైసీపీ పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో విధ్వంసానికి గురైంది

అమరావతి మే 19: గడిచిన మూడేండ్ల వైసీపీ పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో విధ్వంసానికి గురైందని టీడీపీ అధినేత చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం చేసిన తప్పులను ప్రశ్నించే వారిపై పోలీసులు కేసులు పెట్టడం దారుణమని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ ప్రభుత్వంపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని , ప్రభుత్వం విధిస్తున్న పన్నులు ,పెంచుతున్న ధరల వల్ల విసుగెత్తిపోయారని అన్నారు. ప్రజల్లో టీడీపీపై విశ్వాసం పెంచేలా టీడీపీ కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి తామున్నామంటూ భరోసా కల్పించాలని పిలుపునిచ్చారు.కర్నూలు జిల్లా కేంద్రంలో కర్నూలు, నంద్యాల జిల్లాల కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో బాబు మాట్లాడారు. ‘‘ 40 ఏండ్లుగా టీడీపీని భుజాలు అరిగిపోయే విధంగా జెండాలు మోసారు. ప్రత్యర్థులు చేతిలో బలైన టీడీపీ కుటుం సభ్యులు బెదరకుండా పార్టీ కోసం ఎన్నో త్యాగాలు చేశారు. ఎన్టీఆర్‌ వేసిన ఫౌండేషన్‌ తెలుగు జాతీ ఉన్నంతవరకు టీడీపీ ఉంటుంద’’ ని పేర్కొన్నారు. పార్టీని దెబ్బతీసేందుకు కుట్రలు పన్నిన నాయకులు కాలగర్భంలో కలిసిపోయారని వెల్లడించారు.ఇదే నెలలో ఒంగోలులో నిర్వహించనున్న పార్టీ ఆవిర్భావ సభ లో పార్టీని ముందుకు తీసుకెళ్లేందుకు అనుసరించాల్సిన విధానాలపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారుటీడీపీ శ్రేణులు తలుచుకుంటే పోలీసులు ఏం చేయలేరని వెల్లడించారు. టీడీపీ జెండాలను తొలగించి వైసీపీ జెండాలను పెట్టడం తగదని అన్నారు. రాజకీయ పార్టీలను ప్రభుత్వం సమానంగా చూడాలని హితవు పలికారు. కేసులు పెడితే భయపడబోమని అన్నారు.బాదుడే బాదుడు కార్యక్రమం కింద ప్రతీ కార్యకర్త ఇంటింటికి వెళ్లి ప్రజలకు తామున్నామంటూ భరోసా కల్పించాలని కార్యకర్తలకు సూచించారు. వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి అవినీతి, అక్రమాలకు పాల్పడి కోట్లాది రూపాయలను సంపాదించారని ఆరోపించారు. అలాంటి వ్యక్తి తనను విమర్శించే హక్కులేదని అన్నారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article