మోడీకి చంద్రబాబు అల్టిమేటం

Chandrababu Naidu Ultimate to Modi

రానున్న ఎన్నికల్లో మోడీ ని గద్దె దించడమే లక్ష్యంగా బీజేపీయేతర కూటమి తన కార్యాచరణను ప్రారంభించింది. అందులో భాగంగా తొలి అడుగు పడింది. కోల్ కత్తాలో తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ నిర్వహించిన యునైటెడ్ ఇండియా బ్రిగేడ్ లో దేశవ్యాప్తంగా ఉన్న ప్రాంతీయ పార్టీల అధినేతలు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొన్నారు. ఇక ఈ ర్యాలీ సందర్భంగా నిర్వహించిన సభలో చంద్రబాబు నాయుడు మోడీ పై ఫైర్ అయ్యారు. మోడీ అనుసరిస్తున్న విధానాల తో వచ్చే ఎన్నికల్లో భారీ మూల్యం చెల్లించక తప్పదని మోడీకి అల్టిమేటం జారీ చేశారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.
దేశాన్ని కాపాడుకోవాలనేదే మా అందరి లక్ష్యమన్నారు టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు. బీజేపీ దేశాన్ని విచ్ఛిన్నం చేయాలనుకుంటే విపక్షాలుగా మేం ఏకం చేయాలనుకుంటున్నామని చెప్పారు. కోల్‌కతాలో నిర్వహించిన విపక్షాల ఐక్యతా ర్యాలీలో ప్రసంగించిన చంద్రబాబు బెంగాలీలో తన ప్రసంగాన్ని ప్రారంభించారు. స్వాతంత్ర్య సంగ్రామానికి పశ్చిమబెంగాల్ దశాదిశ చూపిందన్నారు. విపక్షాల ఐక్యతకు గొప్ప వేదికను ఏర్పాటు చేశారంటూ తృణమూల్‌ అధినేత్రి మమతా బెనర్జీని ప్రశంసించారు ఏపీ సీఎం చంద్రబాబు. విభజించు పాలించు అనే రీతిలో బీజేపీ దేశాన్ని పాలిస్తోందని ఆయన ఆరోపించారు. రైతుల కష్టాలు కేంద్రానికి పట్టడం లేదన్నారు. ఆర్థిక వ్యవస్థనూ కేంద్ర ప్రభుత్వం రాజకీయం చేసిందన్నారు. పెద్ద నోట్ల రద్దే అందుకు నిదర్శనమని చెప్పారు. మరోవైపు రాఫెల్‌ యుద్ధ విమానాల కొనుగోలులో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారని చంద్రబాబు దుయ్యబట్టారు. పెట్రోల్‌, గ్యాస్‌, డీజిల్‌ ధరలు విపరీతంగా పెరుగుతున్నాయని, ధరల పెరుగుదలను నియంత్రించడంలో మోడీ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. ఇక రాష్ట్రాల హక్కు కాలరాసి వేధింపులకు పాల్పడుతున్నారని చంద్రబాబు మండిపడ్డారు. రాష్ట్రాలను దెబ్బతీసే ప్రయత్నాలు చేస్తే కేంద్రం తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన హామీలను కూడా కేంద్రం అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేసిన చంద్రబాబు 2019లో దేశానికి కొత్త ప్రధాని రావడం ఖాయమని చెప్పారు. గతంలో ఎన్టీఆర్ హయాంలో నేషనల్ ఫ్రంట్ ఏర్పాటైందని, ఫస్ట్ మీటింగ్ విజయవాడలోనూ, సెకండ్ మీటింగ్ కలకత్తాలో జరిగిందని చెప్పారు. ఇప్పుడు అమరావతిలో కూడా తాము పెద్ద ఎత్తున సమావేశం ఏర్పాటు చేస్తామని, ప్రతి ఒక్కరూ హాజరుకావాలని నేతలను కోరారు చంద్రబాబు.

kolkata politics

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article