జగన్ కేసులో చంద్రబాబు సెల్ప్ గోల్?

Chandrababu Self goal on Jagan Cases

  • ఎన్ఐఏకి కేసు అప్పగింతపై మోదీకి నిరసన లేఖ
  • టీడీపీ అధినేత తీరుతో రాజకీయ వర్గాల్లో విస్మయం
  • టీడీపీ ప్రమేయం లేకుంటే భయం ఎందుకని వైఎస్సార్ సీపీ ప్రశ్న

టీడీపీ అధినేత చంద్రబాబులో ఫ్రస్టేషన్ ఎక్కువైందా? ఆ ఫ్రస్టేషన్లోనే ఏం చేస్తున్నారో తెలియకుండా తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటున్నారా? వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై హత్యాయత్నం కేసును కేంద్రం ఎన్ఐఏకి అప్పగించడాన్ని నిరసిస్తూ ప్రధానికి లేఖ రాయడం ద్వారా సెల్ప్ గోల్ వేసుకున్నారా? ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే ఔననే అనిపిస్తోంది. జగన్ పై హత్యాయత్నం కేసు విచారణను ఎన్ఐఏకి అప్పగించడం సరికాదని, దీనిపై తమ ప్రభుత్వానికి అభ్యంతరాలు ఉన్నాయని, వెంటనే ఆ నిర్ణయాన్ని రీకాల్ చేయాలని పేర్కొంటూ ప్రధాని నరేంద్ర మోదీకి చంద్రబాబు ఐదు పేజీల లేఖ రాశారు. రాజకీయాల్లో ఎంతో అనుభవం ఉన్న వ్యక్తి, దాదాపు 14 ఏళ్లపాటు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఇలా లేఖ రాయడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. ఈ హత్యాయత్నంలో నిజంగా తెలుగుదేశం పాత్ర ఉందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. జగన్ పై విశాఖ విమానాశ్రయంలో హత్యాయత్నం జరిగినప్పటి నుంచి ఇప్పటివరకు ఈ విషయంలో చంద్రబాబు ప్రభుత్వం అనుసరించిన వైఖరి చాలా సందర్భాల్లో అనుమానాస్పదంగానే ఉంది. హత్యాయత్నం జరిగిన వెంటనే పూర్తిస్థాయి విచారణ జరపకుండానే నిందితుడు జగన్ అభిమాని అని, సానుభూతి కోసమే హత్యాయత్నం చేశాడని డీజీపీ ప్రకటించడం విమర్శలకు దారితీసింది. తర్వాత కూడా కొన్ని అంశాల్లో తెలుగుదేశం వైఖరి అనుమానాలకు తావిచ్చింది. ఈ నేపథ్యంలో తమకు ఏపీ పోలీసుల దర్యాప్తు తీరుపై నమ్మకం లేదని జగన్ స్పష్టం చేయడంతో, ఎట్టకేలకు ఈ కేసును కేంద్రం ఎన్ఐఏకి అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో టీడీపీ గొంతులో పచ్చి వెలక్కాయ అడ్డుపడినట్టయింది. ఈ నిర్ణయం ప్రకటించిన వెంటనే తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేసిన చంద్రబాబు.. తాజాగా ప్రధానికి లేఖ రాశారు. బాబు ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారో అర్థం కావడంలేదని అంటున్నారు. వాస్తవానికి ఏ కేసులోనైనా దర్యాప్తు సంస్థలు చేసే పని.. నిందితులను గుర్తించి కేసును పరిష్కరించడం. అది ఎవరు చేసినా ఒకటే. మరి అలాంటప్పుడు ప్రత్యేకించి చంద్రబాబు ఈ కేసు విషయంలో అంతగా స్పందించడానికి కారణం ఏమిటని వైఎస్సార్ సీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఎన్‌ఐఏ విచారణలో అసలు వాస్తవాలు బయటకు వస్తాయనే భయంతోనే చంద్రబాబు విచారణకు సహరించడంలేదని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎన్‌ఐఏ దర్యాప్తు అనగానే చంద్రబాబు సర్కారు ఎందుకు వణికిపోతోందని, ఈ కేసులో టీడీపీ పాత్ర లేకుంటే బాబు ప్రభుత్వం ఎందుకు భయపడుతోందని నిలదీస్తున్నారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article