చంద్రబాబు వర్సెస్ కేసీఆర్

AP CM Chandrababu VS Telangana CM KCR… చెక్ పెట్టేదెవరో .. చక్రం తిప్పేదెవరో

ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఇదే హాట్ టాపిక్… చంద్రబాబు వర్సెస్ కెసిఆర్.
..మీరు తెలంగాణకు వస్తే.. మేం ఆంధ్రాకు వస్తాం. మీరు గిప్ట్ ఇస్తే.. మేం రిటర్న్‌ గిఫ్ట్‌ ఇస్తం. ఛలో.. చూసుకుందాం. రాజకీయంగానే తేల్చుకుందాం. ఇప్పుడు ఈ మాటలు.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో కాకపుట్టిస్తున్నాయి. పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ.. ఏపీలో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. చంద్రబాబుకు రిటర్న్‌ గిఫ్ట్ ఇస్తామన్న కేసీఆర్.. ఆ దిశగా స్కెచ్‌ వేస్తున్నట్టు టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే జగన్‌తో టీఆర్ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భేటీ అయ్యారు. ఫిబ్రవరిలో సీఎం కేసీఆర్ అమరావతిలో పర్యటించే అవకాశముంది. ఇక కేసీఆర్ ఏపీ రాజకీయాల్లో వేలు పెడుతున్న నేపథ్యంలో చంద్రబాబు నాయుడు సైతం తన జాగ్రత్తలో తాను ఉన్నారు. ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ప్రతిపక్ష పార్టీలకు ఎక్కడా అవకాశం ఇవ్వకుండా వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నారు.
ఏపీ రాజకీయాల్లో కచ్చితంగా వేలు పెడతామన్న కేసీఆర్.. బీసీ నినాదంతో టీడీపీకి చెక్‌ పెట్టాలని భావిస్తున్నారు. ఏపీలో సామాజిక సమీకరణలు.. నియోజకవర్గాల పరిస్థితులపై సీఎం కేసీఆర్ ఆరా తీశారు. ఏపీలో సుమారు 100 నియోజకవర్గాల్లో బీసీల ప్రభావం ఉంటుందని నిర్దారణకు వచ్చారు. ఇప్పటికే ఒకసారి ఆంధ్రాలో పర్యటించి పొలిటికల్‌ హీట్‌ను రగిలించిన తలసాని.. త్వరలో రాయలసీమలో పర్యటించనున్నారు. రాయలసీమలో రాజకీయ పరిస్థితిపై ఆరా తీయనున్నారు. సీఎం కేసీఆర్‌తో జతకట్టిన ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌.. ఏపీలోని ముస్లిం ఓటు బ్యాంక్‌ను ప్రభావితం చేస్తున్నారు. ఏపీ ముస్లింలంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ గెలుపునకు కృషి చేయాల్సిందిగా ఓవైసీ పిలుపునిచ్చారు.
అటు బీసీల ఓట్లు.. ఇటు ముస్లింల ఓట్లు.. జగన్‌ సామాజిక వర్గం ఓట్లు.. వైఎస్ఆర్ కాంగ్రెస్‌కు కలిసివచ్చే అవకాశముందని ఆ పార్టీల నేతలు భావిస్తున్నారు. చంద్రబాబుకు రిటర్న్‌గిఫ్ట్ ఇచ్చేందుకు కేసీఆర్ బహుముఖ వ్యూహాలను అనుసరిస్తున్నారని టీఆర్ఎస్‌ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే ఏపీ సీఎం చంద్రబాబు సైతం కేసిఆర్ ని తలదన్నే వ్యూహాలతో బీసీల పాట పాడుతున్నారు. అంతేకాదు అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకునేలా కేవలం స్కీం లను ప్రకటిస్తూ వాటిని ఎన్నికలకు ముందే అమలు చేస్తూ తనదైన వ్యూహంలో ముందుకు వెళుతున్నారు. ఒక పక్క కేంద్ర సర్కార్ బిజెపి, మరోపక్క రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీ వైసిపి, పక్క రాష్ట్రం లోని టిఆర్ఎస్.. అన్ని పార్టీలను ఒంటరిగా ఎదుర్కోవడానికి కావాల్సిన అస్త్రశస్త్రాలను ఇప్పటికే రెడీ చేసుకున్న చంద్రబాబు ఆ దిశగా ముందుకు వెళ్తున్నారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article