తల్లీదండ్రుల్లేరు.. అదే బాధ..

104
Chief Justice Of India NV Ramana
Chief Justice Of India NV Ramana

భారత ప్రధాన న్యాయమూర్తి జస్టీస్ ఎన్వీ రమణ

పిల్లలు జీవితంలో రాణించాలని తల్లిదండ్రులు తపించడం సహజం. తమ విజయాలను చూసి తల్లిదండ్రులు గర్వించాలని, ఆనందించాలని పిల్లలు ఆశించడం కూడా అంతే సహజం. నేనూ అందుకు మినహాయింపు కాదు. నేను భారత న్యాయవ్యవస్థలో అత్యున్నత స్థానానికి చేరుకున్న ఈ సమయంలో నన్ను చూసి గర్వించడానికి, మనస్ఫూర్తిగా అభినందించడానికి నా తల్లిదండ్రులు ఈ లోకంలో లేరన్న వాస్తవం బాధిస్తూ ఉండేది. భారత ప్రధాన న్యాయమూర్తిగా నా ఈ వారం రోజుల తొలి పర్యటనలో తెలుగు ప్రజలు ఆ లోటు తీర్చారు. నన్నుగన్న తల్లితండ్రుల వోలె, నన్ను పసిబిడ్డ మాదిరి అక్కున జేర్చుకుని అపార ప్రేమాభిమానాలతో, ఆశీర్వచనాలతో ముంచెత్తిన నిష్కల్మష, ప్రగతిశీల తెలంగాణ సమాజానికి శతకోటి వందనాలు. నా జీవితంలో భావోద్వేగానికి గురైన సందర్భాలలో ఈ పర్యటన ఒకటి.

కోవిడ్ కు సైతం వెరవక, వారించినా వినక, వారనక వీరనక అసంఖ్యాకంగా వచ్చి నన్ను తమలో ఒకడిగా, ఆప్తుడిగా భావించి, అభినందించి, వెన్ను తట్టి, ఆశీర్వదించిన పెద్దలు, అక్కచెల్లెళ్ళు, అన్నతమ్ముళ్ళు ప్రతి ఒక్కరికీ పేరుపేరునా కృతజ్ఞతాభివందనాలు. న్యాయవాదులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు, యువత, శ్రామికులు, మహిళలు, రైతులు, సకల జీవన రంగాలకు చెందిన వారు, కులమతాలకతీతంగా, ఎటువంటి ప్రతిఫలాపేక్ష లేకుండా నన్ను పలకరించారు, దీవించారు. స్వంత పనులు ఎవ్వరూ ప్రస్తావించలేదు. వారు కోరిందల్లా న్యాయ వ్యవస్థను పటిష్టపరచమని మాత్రమే. తెలంగాణ సమాజపు నిస్వార్ధ గుణానికి, పరిణతికి ప్రతీకలు వారు.

వయోవృద్ధులు, గురుతుల్యులైన విశ్రాంత న్యాయమూర్తులు నన్ను దీవించడానికి ఏడాదిన్నర కోవిడ్ కాలంలో తొలిసారి గడప దాటటం నన్ను కదిలించింది. వారికి నమస్సులు. ముఖ్యమంత్రి మొదలుకుని అతి సాధారణ పౌరుని వరకు ప్రతి ఒక్కరూ ఈ అసాధారణ సమయంలో వ్యయ ప్రయాసలకోర్చి నాకు స్వాగతం పలికి , ‘అంతా మనోళ్ళే’ అన్న తెలంగాణ నైజానికి, సుప్రసిద్ధ హైదరాబాదీ ఆతిధ్యానికి అద్దం పట్టారు. అనూహ్య స్వాగతం పలికిన తెలంగాణ ప్రభుత్వానికి, గవర్నర్ గారికి, ముఖ్యమంత్రి గారికి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారికి, న్యాయమూర్తులకు, మంత్రివర్యులకు, ప్రజా ప్రతినిధులకు, సకల పక్షాల నాయకులకు, అధికారులకు ధన్యవాదాలు.

దివ్యాతి దివ్యమైన దైవ దర్శనానికి, ఆశీర్వచన ప్రాప్తికి అల్ప వ్యవధిలో అన్ని ఏర్పాట్లు చేసిన తిరుమల తిరుపతి, యాదాద్రి, శ్రీశైలం దేవస్థానాల పాలక మండళ్ళకు, ప్రభుత్వ ప్రతినిధులకు, స్థానిక అధికారులకు నేనూ, నా సతీమణి శివమాల సదా కృతజ్ఞులం. యాదాద్రిని దేశంలోనే అతి ముఖ్య తీర్థ యాత్రా స్థలాల్లో ఒకటిగా తీర్చిదిద్దేందుకు తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న కృషి ప్రశంసనీయం. వారం క్రితం తెలుగు నేలపై కాలు మోపినప్పటి నుంచి నేడు ఢిల్లీ బయలుదేరే వరకు నన్ను , నా సిబ్బందిని కంటికి రెప్పలా చూసుకున్న తెలంగాణ ప్రభుత్వ అధికారులకు, రాజ్ భవన్ సిబ్బందికి, హైకోర్టు సిబ్బందికి, పోలీసు సిబ్బందికి, ఎంతగానో సహకరించిన పాత్రికేయులకు కృతజ్ఞతలు.

కోవిడ్ ముప్పు పూర్తిగా తొలగిపోయిందని శాస్త్రవేత్తలు , ప్రభుత్వం నిర్ధారించేవరకు దయచేసి తగు జాగ్రత్తలు పాటిస్తూనే ఉండండి. నిర్లక్ష్యం ఏ మాత్రం తగదు. తెలుగు ప్రజల దీవెనల బలంతో నా రాజ్యాంగ బద్ధ విధులను సమర్థంగా నిర్వహించగలనన్న నమ్మకంతో తిరుగు ప్రయణమవుతున్నా.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here