అమెరికాకు చైనా సవాల్

China Challenging America

  • అతిశక్తివంతమైన అణ్వాయుధేతర బాంబు తయారీ
  • అమెరికా ‘మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్’ కంటే శక్తివంతమని వెల్లడి

ప్రపంచంలో ఆయుధ పోటీ అంతకంతకూ పెరుగుతోంది. దాదాపు ప్రతి దేశం తన ఆయుధ సంపత్తిని, శక్తి సామర్థ్యాలను పెంచుకుంటున్నాయి. ముఖ్యంగా అగ్రదేశాలు శాంతి మంత్రం జపిస్తూనే తమ తమ ఆయుధాలను ఎప్పటికప్పుడు మెరుగుపరుచుకుంటున్నాయి. అమెరికా, రష్యా, ఫ్రాన్స్, జపాన్ లకు ధీటుగా చైనా కూడా తన రక్షణ సామర్థ్యాన్ని గణనీయంగా పెంచుకుంది. తాజాగా అమెరికా దగ్గరున్న ‘మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్’ కంటే శక్తివంతమైన బాంబును పరీక్షించింది. హెచ్‌-6కె అనే బాంబర్‌ సాయంతో ఈ బాంబును పరీక్షించినట్లు చైనా మీడియా గ్లోబల్‌ టైమ్స్‌ మీడియా వెల్లడించింది. ఈ బాంబును పరీక్షించిన వీడియోను.. ఆ దేశ రక్షణ సంస్థ నార్త్‌ ఇండస్ట్రీస్‌ గ్రూప్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌(ఎన్‌ఓఆర్‌ఎన్‌సీఓ ) తన వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేసింది. తద్వారా తమ వద్ద కూడా అణు బాంబులకు ప్రత్యామ్నాయ, అత్యంత శక్తిమంతమైన బాంబులు ఉన్నాయని చైనా.. అమెరికాకు పరోక్ష హెచ్చరికలు జారీచేసింది. ‘చైనా అమ్ములపొదిలో ఉన్న అతి శక్తిమంతమైన బాంబు చేరింది. దీనికి చైనీస్ వెర్షన్ ఆఫ్ మదర్‌ ఆఫ్‌ ఆల్‌బాంబ్స్‌ అని పేరు పెట్టాం. అణు బాంబులకు ప్రత్యామ్నాయంగా పనిచేసే ఈ బాంబుతో భారీ విధ్వంసం సృష్టించవచ్చు’ అని పేర్కొంది.

ఏమిటీ మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్?

అణ్వాయుధ ప్రయోగం చాలా దారుణమైన ఫలితాలు ఇస్తుందనే సంగతి తెలిసిందే. అప్పుడు వెలువడే రేడియేషన్ కొన్ని సంవత్సరాల పాటు వెంటాడుతుంది. ఈ నేపథ్యంలో అణ్వాయుధంతో సమానమైన బాంబును తయారుచేయాలనే నిర్ణయంతో అమెరికా అతిశక్తివంతమైన బాంబును రూపొందించింది. జీబీయూ-43/బి ‘మాసివ్ ఆర్డినెన్స్ ఎయిర్ బ్లాస్ట్‘ అనే పేరు కలిగిన ఈ బాంబును ‘మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్’ అని ముద్దుగా పిలుచుకుంటారు. దాదాపు 30 అడుగుల పొడువున్న ఈ బాంబు బరువు ఏకంగా 9,800 టన్నులు. అఫ్గానిస్తాన్ లో అల్లకల్లోలం సృష్టిస్తున్న ఉగ్రవాదులను మట్టుబెట్టేందుకు అమెరికా తొలిసారిగా ఈ బాంబును 2017 ఏప్రిల్ 17న ప్రయోగించింది. ఈ నేపథ్యంలో చైనా కూడా ఇలాంటి బాంబు తయారీపై దృష్టి పెట్టి తాజా బాంబును పరీక్షించింది. అయితే, అమెరికా రూపొందించిన బాంబు కంటే ఈ బాంబు చిన్నది, తేలికైనది. దీనిని మోసుకెళ్లడానికి పెద్దపెద్ద విమానాలు అవసరం ఉండదు. కాగా రష్యా కూడా ఇటువంటి బాంబునే తయారు చేసి దానికి ‘ఫాదర్‌ ఆఫ్‌ ఆల్‌ బాంబ్స్‌’గా నామకరణం చేసింది. అత్యంత పెద్దది, థర్మోబరిక్‌ అయిన ఈ బాంబు చైనా, అమెరికా బాంబుల కంటే పెద్దది. మొత్తమ్మీద చైనా తాజా సవాల్ పై అగ్రరాజ్యం అమెరికా ఎలా స్పందిస్తుందో చూడాలి.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article