తమిళ నటుడు పొన్నాంబళం తెలుగు సినిమాల్లోనూ విలన్‌గా మెరిశాడు.చిరంజీవి సినిమాల్లోనూ ఢీ అంటే ఢీ అన్నట్టుగా ఆయనతో ఫైట్ చేసి ప్రేక్షకుల్ని భయపెట్టాడు. కొన్ని రోజులు కిందట పొన్నాంబళం తీవ్ర అనారోగ్యంతో సతమతమయ్యాడు. కిడ్నీ ఫెయిల్యూర్ కావడం, ఆర్థికంగానూ చితికి పోవడంతో దిక్కుతోచని స్థితిలో అందరినీ సాయం అర్థించాడు. కానీ
ఆయనకి తమిళ చిత్ర పరిశ్రమ నుంచి అరకొరే సాయం అందింది. ప్రాణాలు నిలుపుకోవడం కోసం చివరి ప్రయత్నం అన్నట్టుగా అగ్ర హీరో చిరంజీవికి ఫోన్ చేశాడట. పొన్నాంబళం పరిస్థితి విని వెంటనే నేనున్నానని అభయం ఇచ్చాడట. ఆ విషయాన్ని పొన్నాంబళం స్వయంగా బయటపెట్టాడు. ఆ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. చిరంజీవి చేసిన సాయం గురించి తెలుసుకుని ఆయనకి హ్యాట్సాఫ్ చెబుతున్నారు.
రామ్‌చరణ్‌నీ, ఆయన భార్య ఉపాసనని గుర్తు చేసుకుని మరీ కృతజ్ఞతలు చెబుతున్నాడు పొన్నాంబళం.“చిరంజీవిని సాయం అడిగితే లక్షో రెండు లక్షలో ఇస్తాడనుకుని ఆయనకి ఫోన్ చేశా. వెంటనే ఆయన నా పరిస్థితి కనుక్కుని నువ్వు హైదరాబాద్‌కి వస్తావా లేదంటే చెన్నైలోనే అపోలోకి వెళ్తావా అంటూ అడిగాడు. ఐదు నిమిషాల్లోనే నీకు ఫోన్ వస్తుందని చెప్పాడు. నిజంగా ఐదు నిమిషాల్లోనే నాకు ఫోన్ వచ్చింది. అపోలోలో ఎంట్రీ ఫీజ్ కూడా తీసుకోకుండా మొత్తం రూ:40 లక్షల వైద్యం చేసి పంపారు“ అంటూ చిరంజీవి గురించి గొప్పగా చెప్పుకొచ్చాడు పొన్నాంబళం. ఈ సాయంపై చిరంజీవిపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. మంచి మనసు చాటుకున్నాడని చిరుని అభినందిస్తున్నారు.