కృష్ణానగర్ వీధుల్లో ‘కన్నీటి కళ’లు

62
telugu cinema
telugu cinema
cinema problems
వెండితెరపై కనిపించాలనో లేక తెర వెనక ఏదో ఒక పనిలోఉండాలనో కలలు కనేవాళ్ల మొదటి డెస్టినేషన్ హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని కృష్ణా నగర్. కొత్తగా వచ్చేవాళ్లే కాదు.. ఆల్రెడీ ఉండి ఏదో ఒక బ్రేక్ కోసం ఎదురుచూసేవాళ్లంతా అక్కడే కనిపిస్తారు. జూనియర్ ఆర్టిస్టుల నుంచి సీనియర్ టెక్నీషియన్స్ వరకూ కనిపించే లొకేషన్. అటుపై ఇప్పుడు గణపతి కాంప్లెక్స్ సైతం అలాంటి వారికి అడ్డాగా మారింది. కానీ కోవిడ్ -19 కారణంగా ఈ అడ్డాలన్నీ బోసిపోయాయి ఇప్పుడు. ఇప్పటికే పెద్ద పెద్ద నిర్మాణ కంపెనీలు సైతం తమ వద్ద ఎంతో కాలంగా పనిచేస్తోన్న వారిని వదిలించుకుంటున్నాయి. ఇలా ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు. ఎన్నాళ్లకు మళ్లీ కళారంగంలో మునుపటి కళ కనిపిస్తుందో తెలియని పరిస్థితి. దీంతో ఎడిటర్స్ నుంచి మొదలై.. అసిస్టెంట్స్ వరకూ అందరినీ కొన్నాళ్ల పాటు రావొద్దు అని చెప్పేశారు. వీరితో పాటు 24 క్రాఫ్ట్స్ లోని అసిస్టెంట్స్ పరిస్థితీ అగమ్య గోచరంగా మారింది.  ఈ మధ్య కృష్ణానగర్ లో కొందరు ఎడిటర్స్ ఏదైనా పని కావాలంటూ కనిపించిన వారినల్లా అడుగుతున్నారు. మరికొందరు మీడియా ఛానెల్స్, యూ ట్యూబ్ ఛానల్స్ లో చిన్న ఉద్యోగాలైనా చేస్తాం అంటూ ఆరాలు తీస్తున్నారు.
మరోవైపు గ్రాఫిక్స్ వారి పరిస్థితీ అంతే. ఇక ఆర్టిస్టులైతే.. కాస్త కనిపించి.. ఇప్పుడిప్పుడే డైలాగ్ సీన్స్.. లేదంటే కొంచెం నిడివి ఉండే పాత్రల చేస్తూ ఆకట్టుకుంటున్నాం.. ఏదో రోజు అందరికీ తెలుస్తాం అని ఆశలు పెంచుకున్న ఎందరో కళాకారులు కృష్ణానగర్ వీధుల్లో కన్నీళ్లు పెట్టుకుంటున్నారిప్పుడు. ఇది ఎవరినీ నిందించేందుకు, డిమాండ్ చేసేందుకు వీలు లేని పరిస్థితి. మహమ్మారి విసిరిన పంజాకు ముఖ్యంగా కళారంగం కుదేలైపోయింది. కూలీ పనిచేసే వారి కంటే దారుణంగా మారింది. ఇప్పటికే చాలామంది నగరం విడిచి సొంత ఊళ్లకు వెళ్లిపోయారు. ఉన్నవాళ్లంతా ఇలా కన్నీళ్లకు దిగమింగుకుని .. ఈ కష్టకాలం ఎప్పుడు పోతుందా అని వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఏదేమైనా కరోనా కారణంగా స్టార్స్ కు వచ్చిన ఇబ్బందేమీ లేదు కానీ.. ఆ స్టార్స్ సినిమాలకు పిల్లర్స్ లా నిలబడి తెర వెనక అన్ని కష్టాలు పడినవాళ్లంతా ఇప్పుడు చెల్లాచెదురైపోతున్నారు. మరి ఈ మహమ్మారి పోయేది ఎప్పుడో.. మళ్లీ సినిమాలు వెలిగేదెప్పుడో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here