సినిమాలు డిజిటల్ రిలీజ్ తో ఎవరికి నష్టమంటే..?

Cinemas Digital Release

వినోద రంగంలో డిజిటల్ రాక ఓ పెనువిప్లవం. ఈ విధానం సినిమా వ్యూవర్‌షిప్‌ని అమాంతం మార్చేసింది. సినిమా థియేటర్ లో రిలీజైన నాలుగు వారాల(నెల)కే అమెజాన్ లో లైవ్ చేసుకునే వీలు కల్పిస్తూ చట్టం రూపొందించడం పంపిణీదారుల పాలిట శాపం అయ్యిందనే ఆవేదన కనిపిస్తోంది. నోటి దగ్గర కూటిని లాక్కునేలా.. నాలుగు వారాల కటాఫ్ నియమం బెంబేలెత్తిస్తోందని పలువురు వాపోతున్నారు.డిజిటల్ ప్లాట్ ఫామ్ పై అమెజాన్ బిగ్ సక్సెస్ అయ్యింది. దీని వల్ల నిర్మాతలకు భారీ మొత్తాలు ముడుతున్నాయి. అంతా బాగానే ఉన్నా.. నిర్మాతల నుంచి కొనుక్కున్న బయ్యరు పరిస్థితేంటి? డిస్ట్రిబ్యూటర్ ఏమైపోవాలి? అన్న ప్రశ్న ఉత్పన్నమైంది. ఈ సంక్రాంతి బరిలో రిలీజైన నాలుగు సినిమాలు డిజిటల్ లో లైవ్ కి వచ్చేస్తున్నాయి. ఈ నేపధ్యంలో అసలే సక్సెస్ రేటు అంతంత మాత్రంగా ఉండే వినోదపరిశ్రమకు డిజిటల్ రూపంలో పెద్ద ప్రమాదం పొంచి వుంది అన్న వాదన వినిపిస్తోంది.
జనవరి 8న రిలీజైన కథానాయకుడు, 9న రిలీజైన పేట, 10న రిలీజైన వినయ విధేయ రామ చిత్రాలు డిజిటల్ లో స్ట్రీమింగ్ కి రెడీ అవుతున్నాయి. వీటితో పాటు జనవరి 11న రిలీజై బంపర్ హిట్ కొట్టిన ఎఫ్ 2 చిత్రం అమెజాన్ లో లైవ్ కి వచ్చేస్తోంది. మిగతా సినిమాలు ఫ్లాపైనా, ఎఫ్ 2 ఘనవిజయం సాధించి ఇంకా థియేటర్లలో ఆడుతున్నా.. ఇప్పటికే అమెజాన్‌లో లైవ్ కి వచ్చేస్తోందని ప్రకటించేశారు. దీనివల్ల సక్సెస్ టాక్ విన్న తర్వాతే థియేటర్ కి వెళ్లాలనుకున్న ప్రేక్షకులంతా ఇప్పుడు అమెజాన్ వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో డిజిటల్ వర్ధిల్లుతోంది. మూవీ పాస్ తరహాలో అమెజాన్ ప్రైమ్ అనేది ఓ విప్లవాత్మకమైన కాన్సెప్ట్. ఇది కొందరికి మోదం.. కొందరికి ఖేదం! అన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా సినిమాల్ని కొనుక్కున బయ్యరు నెత్తిన చెంగేసుకుని పోయే విప్లవం ఇదన్న విమర్శ సర్వత్రా వినిపిస్తోంది. ఈ పర్యవసానం మునుముందు సినిమా ట్రేడ్ పై తీవ్ర ప్రభావం చూపించనుందన్న వాదనా వినిపిస్తోంది. అయితే దీనివల్ల పెద్దంత నష్టమేమీ లేదని వాదించేవాళ్లు లేకపోలేదు. అయితే డిస్ట్రిబ్యూటర్, బయ్యర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏమిటి? అన్నది విశ్లేషించాల్సి ఉంటుందని పలువురు ప్రముఖ పంపిణీదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సినిమాలు థియేటర్లలో ఆడుతుండగానే డిజిటల్ స్ట్రీమింగ్ సరికాదన్న వాదన వినిపిస్తున్నారు.

For More Click Here

More Latest Interesting news
- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article