టీఆర్ఎస్ లో విలీనం చేయండి

44
HUZURNAGAR BYPOLL
HUZURNAGAR BYPOLL

CLP WILL MERGE IN TRSLP

  • స్పీకర్ కు 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల వినతి
  • కేసీఆర్ నాయకత్వంలో పనిచేస్తామని వెల్లడి

స్థానిక ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే తెలంగాణలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. కాంగ్రెస్ శానసనసభా పక్షాన్ని టీఆర్ఎస్ లో విలీనం చేయాలని కోరుతూ గురువారం 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డికి లేఖ అందజేశారు. తామంతా బంగారు తెలంగాణ సాధించడం కోసం సీఎం కేసీఆర్ నాయకత్వంలో పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని, తమ లేఖపై వెంటనే నిర్ణయం తీసుకోవాలని కోరారు. అసెంబ్లీ ఫలితాలు వెల్లడైన తర్వాత ఒక్కొక్కరుగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అధికార టీఆర్ఎస్ గూటికి చేరిన సంగతి తెలిసిందే. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 119 స్థానాలకు గానూ 88 సీట్లను టీఆర్ఎస్ గెలుచుకోగా.. కాంగ్రెస్ 19 చోట్ల గెలుపొందింది. ఎంఐఎం 7 సీట్లు, టీడీపీ, 2, స్వతంత్రులు 2, బీజేపీ ఒక స్థానంలో విజయం సాధించాయి. అనంతరం టీఆర్ఎస్ లోకి వలసలు షురూ అయ్యాయి. స్వతంత్రులు ఇద్దరూ అధికార పార్టీలో చేరిపోగా.. కాంగ్రెస్ నుంచి 11 మంది, తెలుగుదేశం నుంచి ఒకరు గులాబీ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. తాజాగా గురువారం తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను కలిసి పార్టీలో చేరడానికి సంసిద్ధత వ్యక్తంచేశారు. వెంటనే కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు టీఆర్ఎస్ లో చేరిన 12 మంది ఎమ్మెల్యేలు ప్రగతి భవన్ లో కేటీఆర్ తో సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. అనంతరం అక్కడి నుంచి మినిస్టర్స్ క్వార్టర్స్ కి వెళ్లి స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డిని  కలిశారు. తమను అధికార పార్టీలో విలీనం చేయాలని కోరుతూ లేఖ ఇచ్చారు.  తామంతా సమావేశమై చర్చించుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. ఆ లేఖపై సబితా ఇంద్రారెడ్డి(మహేశ్వరం), జాజుల సురేందర్ రెడ్డి (ఎల్లారెడ్డి), కందాల ఉపేందర్ రెడ్డి (పాలేరు), హరిప్రియా నాయక్ (ఇల్లందు), గండ్ర వెంకటరమణారెడ్డి (భూపాలపల్లి), హర్షవర్థన్ రెడ్డి (కొల్లాపూర్), వనమా వెంకటేశ్వరరావు (కొత్తగూడెం), రేగ కాంతారావు (పినపాక), చిరుమర్తి లింగయ్య (నకిరేకల్), ఆత్రం సక్కు (ఆసిఫాబాద్), పైలట్ రోహిత్ రెడ్డి (తాండూరు), దేవిరెడ్డి సుధీర్ రెడ్డి (ఎల్బీ నగర్) సంతకాలు చేశారు. నిబంధనల ప్రకారం లేఖ ఇవ్వడంతో ఇక సీఎల్పీ విలీనం లాంఛనమే కానుంది.

TS POLITICS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here