CM Jagan Govt Ready For Local body Polls
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలో ఎన్నికలకు ముహూర్తం ఫిక్స్ చేసింది జగన్ సర్కార్ .జరగనున్న జడ్పీటీసీ, ఎంటీసీ, మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ తేదీల ప్రతిపాదన చేసింది జగన్ సర్కార్ . ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్నికల సంఘానికి ఇందుకు సంబంధించి పలు తేదీలను ప్రతిపాదించింది. మార్చి 7న జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు నోటిఫికేషన్ ఇవ్వాలని, మార్చి 10న మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్, మార్చి 15న గ్రామ పంచాయతీలకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయాలని ఏపీ ప్రభుత్వం ఎన్నికల సంఘాన్ని కోరింది. ఇక మార్చి 21న జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించాలని, మార్చి 24వ తేదీన మున్సిపాలిటీ ఎన్నికలు, మార్చి 27న గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం ఎన్నికల సంఘానికి సూచించింది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్థానిక సంస్థల ఎన్నికలు మార్చి నెలలో నిర్వహించాలని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. నెల రోజుల్లోనే స్థానిక సంస్థల ఎన్నికలను పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
హైకోర్టు కూడా ఇదే విషయం చెప్పినట్లుగా సీఎం జగన్ గుర్తు చేశారు. మార్చి నెలాఖరులోగా ఎంపీటీసీ, జడ్పీటీసీ, పంచాయతీ మున్సిపల్ ఎన్నికలు నిర్వహించేలా ప్రణాళిక సిద్ధంచేయాలని సీఎం జగన్ ఆదేశించారు. ఈ నేపథ్యంలోనే అధికారులు ఎన్నికల సంఘానికి ఈ మేరకు ప్రతిపాదనలు చేసినట్లు తెలుస్తోంది. ఇక పంచాయతీరాజ్ చట్టంలో సవరణలకోసం ఆర్డినెన్స్ తీసుకువచ్చామని సీఎం జగన్ చెప్పారు. డబ్బులు, లిక్కర్లను పూర్తిగా నిరోధించాలన్న దృక్పథంతో ఆర్డినెన్స్ తెచ్చినట్లు జగన్ వివరించారు. పోలీస్‌యంత్రాంగం చాలా దృఢంగా పనిచేయాలని పిలుపునిచ్చిన జగన్… దీన్ని ఒక ఛాలెంజ్‌గా తీసుకోవాలని అన్నారు. డబ్బులు పంచుతూ, ఎన్నికల తర్వాత కూడా నిర్ధారణ అయితే అనర్హత వేటు వేస్తామని సీఎం జగన్ తేల్చిచెప్పారు. అంతేకాదు మూడేళ్ల పాటు జైలు శిక్ష పడుతుందన్నారు. డబ్బులను, మద్యాన్ని అరికట్టాల్సిన బాధ్యత జిల్లా ఎస్పీలు తీసుకోవాలని సీఎం సూచించారు. ప్రతి గ్రామంలో ఉన్న పోలీస్ మిత్రులను, గ్రామంలో మహిళా పోలీసులను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని చెప్పారు.