రాష్ట్రానికి అప్పులు దొరక్కుండా కుట్రలు జరుగుతున్నాయి

  • రాష్ట్రానికి అప్పులు దొరక్కుండా కుట్రలు జరుగుతున్నాయి
    *ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ తీవ్ర వ్యాఖ్యలు
    అమరావతి జూన్ 21: రాష్ట్రంలో రహదారుల పరిస్థితిపై విపక్షాలు ఆరోపణలు గుప్పిస్తున్న తరుణంలో.. ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మన రాష్ట్రానికి అప్పులు దొరక్కుండా కుట్రలు జరుగుతున్నాయని ఆరోపణలు గుప్పించారు. ఈ కారణంగా పనులు పెండింగ్‌లో ఉండకుండా చూడాలని ఆయన అధికారులను ఆదేశించారు. విమానాశ్రయాలు, నగరాలను కలిపే రహదారులతోపాటు గన్నవరం నుంచి విజయవాడ.. భోగాపురం నుంచి విశాఖపట్నం వెళ్లే రోడ్లను సుందరంగా తీర్చిదిద్దాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా ప్రధాన నగరాలు, పట్టణాల్లో ఎంపిక చేసిన రోడ్లను అభివృద్ధి చేసి సుందరీకరించాలన్నారు. ప్రతి నియోజకవర్గంలో జగనన్న స్మార్ట్‌ టౌన్‌షిప్‌లు ప్రారంభించాలని, ఫ్లైఓవర్‌లు, ఆర్‌ఓబీలను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. ఈ మేరకు రోడ్ల నిర్మాణం, వివిధ పనులు పూర్తి చేసేందుకు కార్యాచరణపై క్యాంప్‌ కార్యాలయంలో ఆయన అధికారులతో సమీక్షించారు.కరకట్ట రోడ్డు పనులు కొనసాగుతున్నాయని, క్వార్టర్ల నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా ఆరు మహిళా మార్ట్‌లను నడుపుతున్నామని, జూలైలో కొత్త మార్ట్‌లను ప్రారంభిస్తామని చెప్పారు. ఇప్పటికే ఉన్న మార్ట్‌ల పనితీరుపై సమీక్షించి వాటి సామర్థ్యాన్ని మెరుగుపరిచేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం జగన్‌ ఆదేశించారు. నిర్మాణంలో ఉన్న పనులు నిధులు లేవన్న సాకుతో ఎక్కడా పెండింగ్‌లో పెట్టకూడదని, వీటికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పారు. కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో వచ్చే నెల 15 కల్లా గుంతలు పూడ్చే పనులు చేపట్టాలని ఆదేశించారు.రాష్ట్రంలో అభివృద్ధి కొనసాగకుండా కొందరు కుట్రలు పన్నుతున్నారని సీఎం జగన్‌ ఆరోపించారు. నేరుగా ఎవరి పేరు ఎత్తకుండా సీఎం జగన్‌ ఆరోపణలు చేస్తూ.. రాష్ట్ర ప్రభుత్వానికి రుణాలు ఇవ్వొద్దని, కేంద్రం నుంచి డబ్బులు రావొద్దని సింగిల్ పాయింట్‌ అజెండాతో పనిచేస్తున్నారని దుయ్యబట్టారు. ఎవరెన్ని కుట్రలు చేసినా సంకల్పబలంతో ముందడుగు వేస్తున్నామని చెప్పారు. అభివృద్ధి పనులకు నిధుల లోటు రాకుండా చూసే బాధ్యత తనదన్నారు.మున్సిపల్ మంత్రి ఆదిమూలపు సురేష్, ముఖ్య కార్యదర్శి డాక్టర్ సమీర్ శర్మ, మున్సిపల్ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ వై శ్రీలక్ష్మి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ ప్రవీణ్ కుమార్, ఏపీ సీఆర్డీఏ కమిషనర్ వివేక్ యాదవ్, ఏపీ టిడ్కో ఎండీ సీహెచ్ శ్రీధర్, స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ ఎండీ సంపత్ కుమార్ తదితర అధికారులు సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు.
- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article