కొత్త సర్పంచ్ లకు కేసీఆర్ వార్నింగ్

CM KCR SERIOUS WARNING TO NEW SARPANCHS

బంగారు తెలంగాణఏర్పాటు జరగాలంటే గ్రామ స్వరాజ్యమే కీలకమన్నారు తెలంగాణ సీఎం కేసీఆర్‌. తెలంగాణ వ్యాప్తంగా నూతనంగా ఎంపికైన సర్పంచ్‌లతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. పల్లెలు అన్ని రంగాల్లో పరిపుష్టి సాధించాలన్నదే తన లక్షమన్నారు. ఇందుకోసం అవసరమైన నిధులను ఎప్పటికప్పుడు విడుదల చేస్తామన్నారు.
పల్లెలను ప్రగతి కేంద్రాలుగా తీర్చిదిద్దే మహోన్నత లక్ష్యంతో సీఎం కేసీఆర్‌ నూతనంగా ఎంపికైన సర్పంచ్‌లపై వరాల జల్లు కురిపించారు. రాబోయే ఐదేళ్లలో వలసలు లేని పల్లెల కోసం ప్రణాళికలు సిద్ధం చేయాలంటూ సూచించారు. వార్డు సభ్యులు, గ్రామస్తులతో కలిసి గ్రామ వికాసానికి పాటు పడాలని పిలుపునిచ్చారు. పంచాయతీలకు అవసరమైన నిధులు, విధులు కేటాయిస్తామని, సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు బాధ్యతగా పనిచేయాలని కోరారు.
మంచినీరు, రోడ్లు, విద్యుత్, వంటి ముఖ్యమైన పనులన్నీ ప్రభుత్వమే నేరుగా చేస్తున్నందున గ్రామాల్లో పచ్చదనం పెంచడం, పరిశుభ్రత పాటించడం, వైకుంఠధామాల నిర్మాణంపై దృష్టి పెట్టాలని కోరారు. గ్రామాల సర్పంచులను, గ్రామ కార్యదర్శులను ఛేంజ్ ఏజెంట్సుగా మార్చే బాధ్యతను రిసోర్సు పర్సన్లు చేపట్టాలన్నారు. గ్రామ పంచాయతీలకు అధికారాలను బదిలీ చేసే విషయంలో, నిధులు కేటాయించే విషయంలో అత్యంత ఉదారంగా ఉంటామని, అదే సమయంలో నిధుల దుర్వినియోగానికి పాల్పడినా, విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించినా సర్పంచులు, గ్రామ కార్యదర్శులపై చర్యలు తప్పవంటూ హెచ్చరించారు.
ప్రభుత్వం సమకూర్చిన నిధులు ఎలా ఖర్చు పెడుతున్నారో తెలుసుకోవడానికి ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తామని కేసీఆర్‌ ప్రకటించారు. ఇందుకోసం 25 బృందాలు ఏర్పాటు చేస్తామ్నానారు. ఒక బృందంలో తాను కూడా ఉంటానన్న ఆయన రాష్ట్ర వ్యాప్తంగా నిరంతర తనిఖీలు జరుగుతాయంటూ వెల్లడించారు. ఇందుకోసం పంచాయతి చట్టంలో కూడా నిబంధనలు పొందుపరిచామని ప్రకటించారు.కేసీఆర్‌తో జరిగిన సమావేశంపై సర్పంచ్‌లు సంతృప్తి వ్యక్తం చేశారు. విధులతో పాటు నిధుల అంశాన్ని ప్రస్తావించడాన్ని ఆహ్వానిస్తున్నామన్నారు. ప్రభుత్వ పర్యవేక్షణలో పనిచేసేందుకు ఎలాంటి అభ్యంతరం లేదన్న ప్రజా ప్రతినిధులు తమ అంతిమ లక్ష్యం గ్రామాభ్యుదయేన్నారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article