వర్ష బాధితులకు కేసీఆర్ భరోసా

171
CM KCR SUPPORT PEOPLE
CM KCR SUPPORT PEOPLE

CM KCR SUPPORT PEOPLE

భారీ వర్షాలు, వరదల వల్ల హైదరాబాద్ నగరంలోని లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు ఎన్నో కష్ట నష్టాలకు గురయ్యారని, వారిని ప్రభుత్వం ఆదుకుంటుందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రకటించారు. వరద నీటిలో మునిగిన ప్రాంతాల్లోని ఇళ్లలో నివసిస్తున్నవారు ఎంతో నష్టపోయారని, ఇళ్లలోకి నీళ్లు రావడం వల్ల బియ్యం సహా ఇతర ఆహార పదార్థాలు తడిసి పోయాయని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. వరదనీటి ప్రభావానికి గురైన హైదరాబాద్ నగరంలోని ప్రతి ఇంటికి రూ. 10 వేల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తామని ప్రకటించారు. ఈ ఆర్థిక సాయం మంగళవారం ఉదయం నుంచే ప్రారంభిస్తామని వెల్లడించారు. వర్షాలు, వరదల వల్ల ఇల్లు పూర్తిగా కూలిపోయిన వారికి లక్ష రూపాయల చొప్పున, పాక్షికంగా దెబ్బతిన్న ఇండ్లకు రూ.50వేల చొప్పున ఆర్థిక సాయం అందించనున్నట్లు కేసిఆర్ ప్రకటించారు.

దెబ్బతిన్న రహదారులు, ఇతర మౌళిక వసతులకు యుద్ధప్రాతిపదికన మరమ్మత్తులు చేపట్టి, మళ్లీ మామూలు జీవన పరిస్థితులు నెలకొనేలా చూడాలని అధికారులను సిఎం ఆదేశించారు. పేదలకు సాయం అందించడం కోసం మున్సిపల్ శాఖకు ప్రభుత్వం రూ.550 కోట్లు తక్షణం విడుదల చేస్తుందని సిఎం కేసిఆర్ చెప్పారు. ‘‘గడిచిన వందేళ్లలో ఎన్నడూ లేనంత భారీ వర్షం హైదరాబాద్ నగరంలో కురిసింది. ప్రజలు అనేక కష్టనష్టాలకు గురయ్యారు. ముఖ్యంగా నిరుపేదలు, బస్తీలలో వుండేవారు, లోతట్టు ప్రాంతాల్లో నివసించే వారు ఎక్కువ కష్టాల పాలయ్యారు. వారిని ఆదుకోవడం ప్రభుత్వ ప్రాథమిక విధి. కష్టాల్లో వున్న పేదలకు సాయం అందించడం కన్నా ముఖ్యమైన బాధ్యత ప్రభుత్వానికి మరొకటి లేదు. అందుకే ప్రభావిత ప్రాంతాల్లోని పేదలకు ఇంటికి 10వేల రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించాం’’ అని మఖ్యమంత్రి కేసిఆర్ వెల్లడించారు.

హైదరాబాద్ నగర పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ – మల్కాజ్ గిరి జిల్లాల కలెక్టర్లు, వారి బృందాలు వెంటనే రంగంలోకి దిగి మంగళవారం ఉదయం నుంచే ఆర్థిక సాయం అందించే కార్యక్రమం చేపట్టాలని సిఎం ఆదేశించారు. నగరంలో 200-250 బృందాలను ఏర్పాటు చేసి, అన్ని చోట్లా ఆర్థిక సాయం అందించే కార్యక్రమం పర్యవేక్షించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ను సిఎం ఆదేశించారు. పేదలకు సాయం అందించడం అతిముఖ్యమైన బాధ్యతగా స్వీకరించి హైదరాబాద్ నగరానికి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, మేయర్, డిప్యూటీ మేయర్ , కార్పోరేటర్లు , అంతా భాగస్వాములు కావాలని సిఎం సూచించారు. నష్టపోయిన ప్రజలు ఎంత మంది వున్నాసరే, లక్షల మందికైనా సరే, సాయం అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా వుందని సిఎం చెప్పారు. కాబట్టి బాధిత కుటుంబాల వివరాలు అధికారులకు చెప్పి, సాయం అందించాలని సిఎం కోరారు. టిఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు కూడా సహాయ కార్యక్రమాల్లో పాల్గొనాలని, బాధితులకు అండగా ఉండాలని సిఎం పిలుపునిచ్చారు.

ముఖ్యమంత్రి కేసిఆర్ ఆదేశాల మేరకు హైదరాబాద్ నగరంలోని వర్షాలు, వరద బాధిత పేదలకు సాయం అందించేందుకు ఆర్థిక శాఖ రూ. 550 కోట్లను మున్సిపల్ శాఖకు విడుదల చేసింది. వర్షాలు, వరదల వల్ల నష్టపోయిన రాష్ట్రానికి రూ. 10 కోట్ల ఆర్థిక సాయం ప్రకటించిన తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు కృతజ్ఞతలు తెలిపారు. నగదుతో పాటు బ్లాంకెట్లు, చద్దర్లు, ఇతర సామాగ్రి కూడా పంపుతామని ప్రకటించినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఎంతో ఉదారంగా ముందుకు వచ్చినందుకు తమిళనాడు ప్రభుత్వానికి, సిఎం పళనిస్వామికి, తమిళనాడు ప్రజలకు సిఎం కృతజ్ఞతలు తెలిపారు.

భారీ వర్షాలు, వరదల వల్ల నష్టపోయిన ప్రజలను ఆదుకోవడానికి పారిశ్రామికవేత్తలు, వర్తక-వాణిజ్య-వ్యాపార ప్రముఖులు ముందుకు రావాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు పిలుపునిచ్చారు. కష్టంలో వున్న ప్రజలను ఆదుకోవడానికి ఉదారత చాటాలని కోరారు. సిఎంఆర్ఎఫ్ కు విరివిగా విరాళాలు అందించాలని కోరారు.

Hyderabad Rains Latest Updates

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here