ఓటుహక్కు వినియోగించుకోని సీఎం

CM who was not voted… ఇదేం సంకేతం

తెలంగాణా రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలకు తొమ్మిది నెలల ముందే అసెంబ్లీని రద్దు చేసి, ముందుస్తు ఎన్నికలకు వెళ్లిన కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సారథ్యంలోని టీఆర్ఎస్.. ఘన విజయం సాధించింది. ఊహించని విధంగా ఆ పార్టీకి భారీ మెజారిటీ వచ్చింది. 119 స్థానాలకుగానూ 88 చోట్ల విజయం సాధించి, ప్రతిపక్షాలను చిత్తు చేసింది. ఎన్నో అంచనాలతో బరిలోకి దిగిన ప్రజాకూటమి ఘోర పరాభవాన్ని చవి చూసింది. ఫలితాలు వచ్చిన రెండు రోజులకే వరుసగా రెండోసారి తెలంగాణ సీఎంగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారం తర్వాత శాసనసభను, మంత్రి వర్గాన్ని ఏర్పాటు చేస్తారని భావిస్తే, కేసీఆర్ మాత్రం తన కుమారుడు కల్వకుంట్ల తారక రామారావుకు తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిండెంట్‌గా బాధ్యతలు అప్పగించారు. ఆ తర్వాత జాతీయ రాజకీయాలపై దృష్టి సారించారు. వివిధ రాష్ట్రాలు తిరుగుతూ ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుకు ప్రయత్నాలు చేశారు. ఆ సమయంలో తెలంగాణ ముఖ్యమంత్రిపై భారీ స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. తెలంగాణ ప్రజలు భారీ మెజారిటీతో గెలిపిస్తే వాళ్ల తీర్పుకు కేసీఆర్ తూట్లు పొడిచారన్న కామెంట్లు కూడా వినిపించాయి. తాజాగా ఆయన వ్యవహరించిన తీరు మరోసారి వివాదాస్పదమైంది.
తెలంగాణలో సోమవారం మొదటి విడుత పంచయతీ ఎన్నికల పోలింగ్ జరిగింది. అయితే, ఈ ఎన్నికల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు దంపతులు తమ ఓటు హక్కును వినియోగించుకోలేదు. తొలి విడతలో భాగంగా కేసీఆర్‌ స్వగ్రామమైన సిద్దిపేట రూరల్‌ మండలం చింతమడకలో సోమవారం పంచాయతీ ఎన్నికలు జరిగాయి. వీటికి ఈ దంపతులిద్దరూ దూరంగా ఉన్నారు. దీనికి కారణం కేసీఆర్ దంపతులు ఎర్రవల్లిలో తన వ్యవసాయ క్షేత్రంలో మహా రుద్ర సహిత సహస్ర చండీ మహా యాగంలో పాల్గొనడమేనట. దీంతో కేసీఆర్‌పై మరోసారి విమర్శల వర్షం కురుస్తోంది. ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఓటు హక్కు వినియోగించుకోని కేసీఆర్.. ప్రజలకు ఏం మెసేజ్ ఇస్తున్నట్లు అని పలువురు కామెంట్లు చేస్తున్నారు. ఓటు కంటే యాగాలు ముఖ్యమా అంటూ కొందరు ఆయనను ప్రశ్నిస్తున్నారు. అయితే, రాష్ట్రంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు దిగ్విజయంగా ముందుకు సాగాలని, రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలని, ప్రజలు క్షేమంగా ఉండాలని, వర్షాలు సమృద్ధిగా కురవాలని, వ్యవసాయం సుభిక్షంగా ఉండాలని కేసీఆర్ యాగం నిర్వహిస్తున్నారని సీఎంవో ఓ ప్రకటనను విడుదల చేసింది.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article