* ఓ జంట ఆత్మహత్యాయత్నం
* సకాలంలో స్పందించిన పోలీసులు
* ఇలాంటి సమస్యలకు పరిష్కారం ఎప్పుడు?
తెలంగాణ రాష్ట్రంలో రైతుల పరిస్థితి ఎంతో అధ్వాన్నంగా తయారైంది. ప్రకృతివైపరీత్యం వల్ల చనిపోయే పరిస్థితి దాపురించిందా అంటే అదీ కాదు. ప్రభుత్వ పెద్దలు, స్థానిక అధికారులు వెనకా ముందు చూసుకోకుండా చేసిన తప్పిదాల వల్ల అమాయక ప్రజలు ఆత్మహత్య చేసుకోవాల్సిన దుస్థితి దాపురించింది. కరవు నేపథ్యంలో రైతుల ఆత్మహత్యల గురించి విన్నాం. కానీ, తెలంగాణ ఏర్పడిన తర్వాత.. కొందరు తెలివి తక్కువ అధికారులు చేసిన పొరపాట్ల వల్ల.. అనేకమంది బక్కచిక్కిన రైతులు దారుణంగా దగా పడుతున్నారు. కొన్ని నెలల పాటు అధికారులు చుట్టూ తిరిగినా ఫలితం లేదని గ్రహించిన జనగామలోని ఒక జంట సోమవారం ఆత్మహత్యయత్నం చేసింది. తమ తల్లీదండ్రులు ఆత్మహత్య చేసుకుంటున్నారని తెలుసుకుని వచ్చిన వారి పిల్లలు చేసిన ఆక్రందనలు ప్రతివారిని కలిచివేశాయి. వివరాల్లోకి వెళితే..
సోమవారం ఓ జంట జనగామ కలెక్టర్ కార్యాలయం పైకెక్కి తమ భూసమస్య తీర్చాలని పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య ప్రయత్నం చేశారు. ఎమ్మర్వో తమ భూమిని ఇతరులకు అక్రమ పట్టా చేసారని, తమ సమస్య పరిష్కారించాలని పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య ప్రయత్నం చేయగా పోలీసులు సకాలంలో అడ్డుకున్నారు. గతంలో కూడా ఇదే తరహాలో బాధితుడు నర్సింగరావు ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డారు. ఇలాంటి అనేక మంది బాధితులు రాష్ట్రవ్యాప్తంగా ఉండగా.. సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం పెద్దగా దృష్టి సారించట్లేదనే విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. మరి, ఎన్నికల సంవత్సరంలోనైనా ధరణీ సమస్యను ప్రభుత్వం పరిష్కరించాల్సిన అవసరం ఉంది.