COUPLE GOT RANKS
- పోటీ పరీక్షలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జంట
వివాహం విద్యా నాశాయ అని అంటారు. కానీ ఛత్తీస్ గఢ్ కు చెందిన అనుభవ్ విషయంలో మాత్రం ఇది వర్తించదు. ఎందుకంటే ఆయన పెళ్లి చేసుకున్న తర్వాత భార్యతో కలసి మరీ చదివారు. ఆ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన పోటీ పరీక్షల్లో ఇరువురూ తొలి రెండు స్థానాల్లో నిలిచారు. చాలామంది కలిసి చదువుకున్నవారు పెళ్లి చేసుకుంటారు. కానీ వీరు మాత్రం పెళ్లి చేసుకుని చదువుకోవడం విశేషం. ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్‌కు చెందిన అనుభవ్ సింగ్ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్‌కు ఎంపిక అవ్వాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. ఇందుకోసం చదువు పూర్తవ్వగానే ప్రభుత్వ పరీక్షలకు సిద్ధం కావడం ప్రారంభిచారు. ఆయనకు విభా సింగ్ తో వివాహం అయింది. తర్వాత కూడా ఆయన తన ప్రయత్నాలను విరమించలేదు. భర్త లక్ష్యం తెలుసుకున్న విభా సింగ్ సైతం ఆయనకు చేదోడు వాదోడుగా నిలిచింది. తాను కూడా భర్తతో పాటు పోటీ పరీక్షలకు సిద్ధం కావడం మొదలుపెట్టింది. ఇటీవల చీఫ్ మున్సిపల్ ఆఫీసర్(గ్రేడ్ బీ, గ్రేడ్ సీ)కు పరీక్ష నిర్వహించగా.. వీరిద్దరూ హాజరయ్యారు. తాజాగా వెలువడిన ఫలితాల్లో వీరిద్దరూ ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలిచారు. అనుభవ్‌కు మొదటి ర్యాంకు రాగా, విభా సింగ్ రెండో ర్యాంకు సాధించింది. ఇలా పెళ్లయ్యాక మరీ వీరు ఉద్యోగాలు సాధించడంతో బంధుమిత్రులు హర్షం వ్యక్తంచేస్తున్నారు. ఈ సందర్భంగా అనుభవ్ జంట మీడియాతో మాట్లాడుతూ.. ఒకరికొకరు సాయం చేసుకుంటూ చదవడం వల్లే విజయం సాధించామని చెప్పారు.