యూడీఎస్‌పై క్రెడాయ్ హైద‌రాబాద్ స‌మ‌రం

58
credai hyderabad fight on uds
credai hyderabad fight on uds

Credai Hyd Fight on UDS

”ఫ్లాట్లు బాబు ఫ్లాట్లు.. సూప‌ర్ ల‌గ్జ‌రీ ఫ్లాట్లు..
స‌గం ధ‌ర‌కే క‌ళ్లు చెదిరిపోయే ఫ్లాట్లు..
ఇంత‌కంటే మ‌హాదవ‌కాశం మ‌ళ్లీ రాదు..
హైద‌రాబాద్‌లో డ‌బుల్ బెడ్‌రూం ఫ్లాటు 30 ల‌క్ష‌లే
రూ.50 ల‌క్ష‌ల‌కే ట్రిపుల్ బెడ్‌రూం ఫ్లాటు..”

”రేటు చూస్తేనేమో టెంప్టింగ్‌గా ఉంది..
కాక‌పోతే బ్యాంకు రుణం రాదంటున్నారు..
క‌ష్టార్జితంతో పాటు బంధుమిత్రుల అప్పు..
ఉన్న బంగారాన్ని తాక‌ట్లు పెట్టి కొంటే..
కొన‌క‌పోతే మ‌ళ్లీ ఇలాంటి అవ‌కాశం రాదు..”

హైద‌రాబాద్‌లో భూముల ధ‌ర‌లు అమాంతం పెరిగిన నేప‌థ్యంలో.. కొంద‌రు డెవ‌ల‌ప‌ర్లు అక్ర‌మ మార్గాల్లో ఫ్లాట్ల‌ను విక్ర‌యించ‌డం మొద‌లెట్టారు. త‌క్కువ రేటుకే ఫ్లాటు అంటూ కొనుగోలుదారుల్ని మోసం చేయ‌డం ఆరంభించారు. అమాయ‌క కొనుగోలుదారులేమో ఇంత కంటే గొప్ప ఛాన్సు ల‌భించ‌ద‌ని వేలంవెర్రిగా వాటిని కొనేశారు. న్యూఢిల్లీ- ఎన్‌సీఆర్, ముంబై, పుణె, బెంగ‌ళూరు వంటి న‌గ‌రాల్లో నిర్మాణ రంగాన్ని నిర్వీర్యం చేసిన ఛానెల్ పార్ట‌న‌ర్ల వ్య‌వ‌స్థ ద్వారా కొంద‌రు బిల్డ‌ర్లు అక్ర‌మ మార్గంలో ఫ్లాట్ల‌ను విక్ర‌యించ‌డం మొదలు పెట్టారు. దీన్ని యూడీఎస్ విధానం అంటారు. అంటే, అన్ డివైడెడ్ షేర్ ఆఫ్ ల్యాండ్ స్కీమ్ అన్నమాట.

యూడీఎస్ అంటే ఏమిటి?
అధిక శాతం బిల్డ‌ర్లు స్థానిక సంస్థ‌లతో పాటు రెరా అనుమ‌తి తీసుకుని ఫ్లాట్లు, విల్లాల‌ను విక్ర‌యిస్తారు. కానీ, తాజాగా కొంద‌రేం చేస్తున్నారంటే.. త‌క్కువ రేటంటూ చెబుతూ.. ఫ్లాట్లు, వాణిజ్య స్థ‌లాన్ని కొనుగోలు చేసేవారికి అవిభాజ్య‌పు వాటా స్థ‌లాన్ని (అన్ డివైడెడ్ షేర్ ఆఫ్ ల్యాండ్‌) రిజిస్ట‌ర్ చేస్తున్నారు. అంటే, బ‌య్య‌ర్ల‌కు నేరుగా ఫ్లాట్ల‌ను విక్ర‌యించ‌కుండా తొలుత కొంత స్థ‌లాన్ని రిజిస్ట‌ర్ చేస్తున్నార‌న్న‌మాట‌. త‌క్కువ రేటుకు బిల్డ‌ర్లు అమ్మ‌డం ద్వారా వ‌చ్చే సొమ్ముతో ఆయా నిర్మాణాన్ని పూర్తి చేయ‌డం క‌ష్ట‌మ‌వుతుంది. నిజానికి, ఇలాంటి లావాదేవీల వ‌ల్ల పెట్టుబ‌డిదారుల సొమ్ముకు అస‌లేమాత్రం ర‌క్ష‌ణ ఉండ‌దు. స‌కాలంలో నిర్మాణాలు పూర్తి చేయ‌క బిల్డ‌ర్ చేతులెత్తేస్తే, క‌ష్టార్జితం మొత్తం బూడిద‌లో పోసిన ప‌న్నీరు అవుతుంది.

ఒప్పందం ఎలా?
బిల్డ‌ర్ సాధార‌ణ ఒప్పంద ప‌త్రం బ‌దులు అపార్టుమెంట్ లేదా వాణిజ్య స్థ‌లం కొనుగోలుదారుల‌తో ఒక బృందం ఏర్పాటు చేసి అవిభాజ్య‌పు స్థ‌లంగా విక్ర‌య ఒప్పందాన్ని రాస్తారు. ఆత‌ర్వాత అపార్టుమెంట్ లేదా వాణిజ్య స్థ‌లం కొనుగోలుదారులు చెల్లించే సొమ్మును, బిల్డ‌ర్ స్థ‌ల‌య‌జ‌మానికి చెల్లిస్తారు. సేల్ డీడ్ రాసుకున్న త‌ర్వాత‌, ఆయా కొనుగోలుదారులంతా క‌లిసి బిల్డ‌ర్‌కు జాయింట్ డెవ‌ల‌ప్‌మెంట్ క‌మ్ అగ్రిమెంట్ క‌మ్ జ‌న‌ర‌ల్ ప‌వ‌రాఫ్ అటార్నీని రాసిస్తారు. బిల్డ‌ర్ పేరిట అవిభాజ్య‌పు స్థ‌లాన్ని నిర్మాణం చేప‌ట్ట‌డానికి అప్ప‌గిస్తారు. దాన్ని ఆధారంగా మొద‌టి ఒప్పందం ప్ర‌కారం అపార్టుమెంట్ లేదా వాణిజ్య స్థ‌లం నిర్మాణ ప‌నుల్ని బిల్డ‌ర్ ప్రారంభిస్తారు.

పూర్తి చేస్తార‌న్న గ్యారెంటీ?
ఇలా త‌క్కువ మొత్తానికి బిల్డ‌ర్లు అమ్మ‌డం ద్వారా వ‌చ్చే సొమ్ముతో ఆయా నిర్మాణాన్ని పూర్తి చేయ‌డం క‌ష్ట‌మ‌వుతుంది. నిజానికి, ఇలాంటి లావాదేవీల వ‌ల్ల పెట్టుబ‌డిదారుల సొమ్ముకు అస‌లేమాత్రం ర‌క్ష‌ణ ఉండ‌దు. కొనుగోలుదారుల సొమ్ముకు ఎలాంటి భ‌ద్ర‌తను ఇవ్వ‌ని, వారి జీవితాన్ని అంధ‌కారంలోకి నెట్టేసే ప్ర‌మాద‌మున్న ఇలాంటి విధానాల్ని నిరుత్సాహ‌ప‌ర్చాల‌ని స్థిరాస్తి రంగం బ‌లంగా విశ్వ‌సిస్తోంది. పైగా, ఇటువంటి అనైతిక విధానాల వ‌ల్ల క‌లిగే దుష్ప‌రిణామాల ప‌ట్ల కొనుగోలుదారుల‌కు పెద్ద‌గా అవ‌గాహ‌న ఉండ‌దు. వారికి తెలియ‌దు కూడా. ఈ క్ర‌మంలో అట్టి ప్రాజెక్టును పూర్తి చేసే సామ‌ర్థ్యం మీదే కొనుగోలుదారుల చేతికి ఫ్లాటు వ‌స్తుందా? లేదా అనే అంశం ఆధార‌ప‌డుతుంది.

ఇరుక్కుపోవ‌డ‌మే..
ఆయా ప్రాజెక్టును పూర్తి చేస్తే క్ర‌మంలో బిల్డ‌ర్ ఎలాంటి స‌మ‌స్య‌ల్ని ఎదుర్కొన్నా అంతే సంగ‌తులు. ఆయా అవిభాజ్య‌పు స్థ‌లాన్ని ఇత‌రులెవ్వ‌రికీ అమ్మ‌లేరు. అందులో నుంచి బ‌య‌ట‌ప‌డ‌టం క‌ష్ట‌మ‌వుతుంది. మ‌రో ముఖ్య‌మైన విష‌యం.. 01.01.2017 నుంచి తెలంగాణ రాష్ట్రంలో అమల్లోకి వ‌చ్చిన రెరా (తెలంగాణ రియ‌ల్ ఎస్టేట్ రెగ్యులేష‌న్ అండ్ డెవ‌ల‌ప్‌మెంట్ అథారిటీ చ‌ట్టం- టీఎస్ రెరా) ప్ర‌కారం.. అపార్టుమెంట్ లేదా వాణిజ్య స్థ‌ల కొనుగోలుదారులు ఆయా ప్రాజెక్టులో ప్ర‌మోట‌ర్ అవుతారు. బిల్డ‌ర్ అమ్మే ఇత‌ర ఫ్లాట్ల‌కు అన‌గా, వంద‌లాది మంది కొనుగోలుదారుల‌కు జ‌వాబుదారీగా మారుతారు. ప్రాజెక్టు అప్ప‌గింత‌లో బిల్డ‌ర్ ఏమాత్రం ఆల‌స్యం చేసినా.. పూర్తి చేయ‌కుండా వ‌దిలేసినా.. ఇలా అవిభాజ్య‌పు వాటా కింద స్థ‌లాన్ని కొన్న‌వారు అందుకు బాధ్యులు అవుతారు. రెరా చ‌ట్టం ప్ర‌కారం, ఆర్థిక న‌ష్టాలు, ఇత‌ర అప్పుల‌కు బాధ్య‌త వ‌హించాల్సి ఉంటుంది.

క్రెడాయ్ హైద‌రాబాద్ పోరు
అవిభాజ్య‌పు స్థ‌లం కొనుగోలు విధానం అత్యంత ప్ర‌మాదభ‌రిత‌మైన‌ది. స్థిరాస్తి కొనుగోలుదారులు మ‌రియు డెవ‌ల‌ప‌ర్ల ప్ర‌యోజ‌నాల్ని కాపాడేందుకు క్రెడాయ్ హైద‌రాబాద్ న‌డుం బిగించింది. యూడీఎస్ విధానంలో స్థిరాస్తిని కొనుగోలు చేయ‌కూడ‌ద‌ని కొనుగోలుదారుల‌కు అవ‌గాహ‌న క‌ల్పిస్తోంది. క్రెడాయ్ హైద‌రాబాద్ మేనేజ్మెంట్ క‌మిటీ నిర్ణ‌యం తీసుకున్నాకే.. ప్ర‌జ‌ల్లో అవ‌గాహ‌న క‌లిగించేందుకు నడుం బిగించామ‌ని క్రెడాయ్ హైద‌రాబాద్ జ‌న‌ర‌ల్ సెక్రెట‌రీ వి.రాజ‌శేఖ‌ర్ రెడ్డి తెలిపారు. బ‌య్య‌ర్లు యూడీఎస్ విధానంలో ఫ్లాట్లు, విల్లాలు, వ్య‌క్తిగ‌త గృహాలు, వాణిజ్య స్థ‌లాల్ని కొనుగోలు చేయ‌కూడ‌ద‌ని సూచించారు.

Hyderabad Real Estate Updates

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here