Credai and Treda Appreciated Dharani
ధరణి పోర్టల్ నేపథ్యంలో హైదరాబాద్ లోని క్రెడాయ్, హైదరాబాద్, ట్రెడా సభ్యులు ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ని గురువారం కలిశారు. తక్షణ రిజిస్ట్రేషన్ మరియు ఆస్తుల మ్యుటేషన్ కోసం ధరణి పోర్టల్ ప్రారంభించటాన్ని ఈ సందర్భంగా రెండు సంఘాల సభ్యులు ప్రశంసించారు. అక్టోబరు 29న గౌరవ ముఖ్యమంత్రి ప్రారంభించిన ధరణి అగ్రికల్చరల్ పోర్టల్లో అనుభవం చాలా ప్రోత్సాహకరంగా ఉందని ఈ సందర్భంగా వీరు పేర్కొన్నారు. రియల్ రంగంలో ఇది పారదర్శకతను పెంచింది మరియు ఆస్తుల లావాదేవీలలో పౌరులకు గొప్ప సౌలభ్యాన్ని కలిగిస్తుందన్నారు.
వ్యవసాయేతర ఆస్తి యొక్క లావాదేవీలలో ఎక్కువ భాగం ప్లాట్లు మరియు కొత్తగా నిర్మించిన ఫ్లాట్లు మరియు గృహాల అమ్మకం ద్వారా జరుగుతుందనే అభిప్రాయం ఉన్నందున, అటువంటి లావాదేవీలను త్వరితగతిన ప్రాసెస్ చేయడానికి ప్రత్యేక సదుపాయాన్ని కల్పించాలని భావిస్తున్నట్లు ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ పేర్కొన్నారు. క్రెడాయ్ మరియు ట్రెడా సభ్యులు ధరణీ పోర్టల్ ను స్వాగతించారు మరియు ఈ ప్రాజెక్టుకు వారి పూర్తి సహకారాన్ని అందించారు. పోర్టల్ అభివృద్ధిలో చురుకుగా పాల్గొనడానికి ముందుకొచ్చారు.
క్రెడాయ్ నుంచి రామకృష్ణ, వేణు వినోద్, రాజశేఖర్ రెడ్డి, ఆదిత్య గౌరా.. ట్రెడా నుంచి హరి బాబు, చలపతి రావు, సునీల్, విజయ్ సాయి, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్, జయేష్ రంజన్, వి. శేషాద్రి, జీహెచ్ఎంసీ చీఫ్ సిటీ ప్లానర్ దేవెందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.