ఆ పాస్ వర్డ్ ఖరీదు రూ.వెయ్యి కోట్లు

CRYPT O CURRENCY

  • క్రిప్టో కరెన్సీ రూపంలో పలువురు భారీ పెట్టుబడులు
  • కంపెనీ సీఈఓ ఆకస్మిక మృతి
  • పాస్ వర్డ్ తెలియకపోవడంతో ఇన్వెస్టర్ల బెంబేలు

ఈ మెయిళ్ల దగ్గర నుంచి బ్యాంకింగ్ వ్యవస్థ వరకు అన్నింటా కీలకపాత్ర పోషించేది మనం పెట్టుకునే పాస్ వర్డే. ఆ పాస్ వర్డ్ ఎంత కఠినంగా ఉంటే మన ఈ మెయిళ్లు, బ్యాంకింగ్ వ్యవహారాలు అంత భద్రంగా ఉంటాయి. అయితే, ఈ విషయంలో ఓ వ్యక్తి తీసుకున్న అతిజాగ్రత్త ఏకంగా రూ.వెయ్యి కోట్లకు ఎసరు పెట్టింది. ఎంతో కఠినమైన పాస్ వర్డ్ పెట్టిన అతడు ఆకస్మికంగా మరణించడంతో 19 కోట్ల కెనడా డాలర్ల (రూ.1,030 కోట్లు) సొమ్ము ఫ్రీజ్‌ అయిపోయింది. ఈ డబ్బును ఎలా వెనక్కి తీసుకురావాలో తెలియక టెక్‌ దిగ్గజాలు తలలు పట్టుకుంటున్నారు.

ఇంతకీ విషయం ఏమిటంటే.. ఇటీవల కాలంలో క్రిప్టో కరెన్సీ బాగా ప్రాచుర్యం పొందింది. సాధారణంగా నోట్ల రూపంలో ఉండేది మమూలు కరెన్సీ. నోట్ల రద్దు తర్వాత మనదేశంలో కూడా డిజిటల్ కరెన్సీ (క్రెడిట్, డెబిట్, మొబైల్ వ్యాలెట్ తదితరాలు) ప్రాచుర్యంలోకి వచ్చింది. ఇదే తరహాలో ఉండేదే క్రిప్టో కరెన్సీ. కేవలం ఆన్‌లైన్‌లో మాత్రమే చెల్లుబాటు అయ్యే డిజిటల్‌ కరెన్సీ అన్నమాట. ఇందులో పెట్టుబడి పెడితే భారీ మొత్తంలో లాభాలు ఆర్జించవచ్చనే ఆశతో చాలామంది ఇటువైపు మొగ్గు చూపిస్తున్నారు. ఇలా క్రిప్టో కరెన్సీలో పెట్టుబడులు ఆహ్వానించే ఒక కంపెనీయే కెనడాకు చెందిన క్వాడ్రిగాసీఎక్స్‌. ఇందులో ఎంతోమంది తమ డబ్బును క్రిప్టో కరెన్సీ రూపంలో డిపాజిట్లు చేశారు.

అయితే, ఈ సంస్థ సీఈఓ కెనడాకు చెందిన గెరాల్డ్ కాటన్ ఆకస్మికంగా మృతిచెందారు. దీంతో ఒక్కసారిగా క్వాడ్రిగాసీఎక్స్ లో పెట్టుబడి పెట్టినవారిలో ఆందోళన మొదలైంది. ఈ క్రిప్టో కరెన్సీ లావాదేవీలకు సంబంధించిన డిజిటల్‌ వాలెట్‌ పాస్ వర్డ్ లు కాటన్‌కు తప్ప మరెవరికీ తెలీదు. దీంతో కోట్లాది రూపాయల సొమ్మును ఎలా వెనక్కి తీసుకురావాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. ఆ పాస్‌ వర్డ్ లు కనుక్కోవడానికి సాంకేతిక నిపుణులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నా ఫలితం మాత్రం కనిపించడంలేదు. భద్రత విషయంలో ఎంతో జాగరూకతతో ఉండే కాటన్.. అన్నీ ఎన్ క్రిప్ట్ చేసేవారు. ఎవరూ హ్యాక్ చేయకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. దీంతో ఆయన పెట్టిన పాస్ వర్డ్ లు రికవరీ చేయడం ఐటీ నిపుణుల వల్ల కూడా కావడంలేదు. మొత్తమ్మీద ఒక్క పాస్ వర్డ్ రూ.వెయ్యి కోట్లకు ఎసరు పెట్టింది.

INTERNATIONAL NEWS

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article