వైఎస్సార్ సీపీలోకి దగ్గుబాటి తనయుడు

DAGGUBATI SON TO JOIN IN YSRCP

  • జగన్ ను కలిసిన వెంకటేశ్వరరావు, హితేష్

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రోజురోజుకూ రంజుగా మారుతున్నాయి. నేతల పార్టీ మార్పులు కొనసాగుతున్నాయి. తాజాగా ఎన్టీఆర్ పెద్దల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు తన కుమారుడు హితేష్ తో కలిసి వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో భేటీ అయ్యారు. దగ్గుబాటి కుటుంబం వైఎస్సార్ సీపీలో చేరుతుందంటూ గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆదివారం ఆయన తన కుమారుడితో కలిసి జగన్ తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తన కుమారుడు వైఎస్సార్ సీపీలో చేరే అంశంపై జగన్ తో చర్చించారు. ఇందుకు జగన్ సానుకూలంగా స్పందించడంతో హితేష్ చేరిక ఇక లాంఛనమే కానుంది. అనంతరం దగ్గుబాటి మీడియాతో మాట్లాడుతూ.. జగన్‌తో కలిసి హితేశ్‌ పనిచేస్తారు. మా నిర్ణయాన్ని జగన్‌ స్వాగతించారు. గత రెండేళ్లుగా జగన్‌ ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని పార్టీని నడుపుతున్నారు. ఆయన పడుతున్న కష్టానికి దేవుడు తగిన ప్రతిఫలం చూపెడతాడు. ప్రజలు కూడా ఆయన కష్టాన్ని గుర్తిస్తున్నారు’ అని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో పాలన గాడి తప్పిందని దగ్గుబాటి ధ్వజమెత్తారు. నాలుగు, ఐదో విడుత రైతుల రుణమాఫీకి ఇంకా డబ్బులు విడుదల చేయలేదని విమర్శించారు. పోస్ట్‌ డేటెడ్‌ చెక్కులతో డ్వాక్రా మహిళలకు డబ్బులు ఇస్తామని చెబుతున్నారని.. ఇంత విచిత్రమైన పాలనను ఎప్పుడూ చూడలేదని వ్యాఖ్యానించారు. కాగా, తన కుమారుడు వైఎస్సార్ సీపీలో చేరినప్పటికీ, తన భార్య పురంధేశ్వరి మాత్రం బీజేపీలోనే కొనసాగుతారని దగ్గుబాటి స్పష్టంచేశారు. ప్రస్తుతం పురంధేశ్వరి బీజేపీ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ గా ఉన్నారు.

AP POLITICS

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article