DCC RAGADA IN CONGRESS PARTY
అసలే తెలంగాణా ముందస్తు ఎన్నికల్లో కోలుకోలేని దెబ్బ తిన్న కాంగ్రెస్ పార్టీలో డీసీసీ అధ్యక్షుల నియామకం చిచ్చు రాజేస్తోంది. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో డిసిసి అధ్యక్షులు నియామకాన్ని చేపట్టింది కాంగ్రెస్ అధిష్టానం. పార్లమెంటు ఎన్నికలు ఈసారి కాంగ్రెస్ పార్టీకి అత్యంత కీలకం కానున్న నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత పూర్తిస్థాయి ప్రక్షాళనకు రంగం సిద్ధం చేసుకుంది. పాత కమిటీలతో అయితే పార్లమెంట్ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించలేమని భావించిన కారణంగా కొత్త కమిటీలను ఏర్పాటు చేసింది. అసలే అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం చవిచూసిన తెలంగాణ కాంగ్రెస్ కు ఇప్పుడు కొత్త చిక్కులు వచ్చి పడుతున్నాయి. డిసిసి అధ్యక్షుల నియామకం పార్టీలో కొత్త చిచ్చుకు కారణమవుతోంది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడిగా మాజీమంత్రి, కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావును పీసీసీ నియమించింది. దీంతో ఆ పదవిపై ఆశలు పెట్టుకున్న పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ క్రమంలోనే ఆయన పీసీసీ ప్రధాన కార్యదర్శి పదవికి, మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ కన్వీనర్ పదవికి రాజీనామా చేస్తునట్టు ప్రకటించారు. తన రాజీనామా లేఖను పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి శుక్రవారం పంపిస్తున్నట్టు చెప్పారు. పార్టీ పదవుల్లో గిరిపుత్రులకు న్యాయం జరగడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీలో కష్టపడే వారికి కాకుండా, పార్టీలు మారేవారికి ప్రాధాన్యం కల్పిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా రేగా కు డీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వనందుకు నిరసనగా రేగా యువసేన పేరిట మణుగూరు బంద్‌కు పిలుపునిస్తూ వాట్సాప్‌లో సమాచారం పోస్టులు కూడా షేర్ అయ్యాయి. ఆ తర్వాత వాటి తొలగించారు. పార్లమెంట్ ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో ఇలాంటి పరిణామాలు కాంగ్రెస్ కు కొంత ఇబ్బంది కలిగించే అంశమే అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.