Decide Right.. Choose Right
ఎట్టకేలకు ‘యూడీఎస్’ పై క్రెడాయ్ హైదరాబాద్ అధికారికంగా స్పందించింది. యూడీఎస్ స్కీములో భాగం ప్రాపర్టీ కొని బలి కావొద్దని కొనుగోలుదారుల్ని సూచించింది. ఈ క్రమంలో కేవలం రెరాలో నమోదైన ప్రాజెక్టుల్ని మాత్రమే కొనుగోలు చేయాలని కొనుగోలుదారుల్ని కోరుతున్నది. డిసైడ్ రైట్.. చూస్ రైట్ అంటూ క్రెడాయ్ హైదరాబాద్ ఏప్రిల్ 16 నుంచి 18 మధ్యలో హైటెక్స్ లో ప్రతిష్ఠాత్మక ప్రాపర్టీ షోను నిర్వహిస్తోంది. ఎప్పటిలాగే వందకు పైగా స్టాళ్లతో అట్టహాసంగా నిర్వహించే ఈ మూడు రోజుల కొనుగోళ్ల పండుగను విజయవంతం చేయాలని కోరుతోంది. మొత్తానికి, యూడీఎస్ పై టీఎస్ న్యూస్ రాస్తున్న కథనాలకు గల ప్రాముఖ్యతను క్రెడాయ్ హైదరాబాద్ గుర్తించినట్లు అయ్యింది. తదనుగుణంగా యూడీఎస్ పథకం కింద ఇళ్లను కొనడం కరెక్టు కాదని అంటోంది. ఈ క్రమంలో భాగంగా యూడీఎస్ పై బయ్యర్లకు అవగాహన కల్పించడం మంచి నిర్ణయమని హైదరాబాద్ వాసులు భావిస్తున్నారు. క్రెడాయ్ హైదరాబాద్ తీసుకున్న ఈ నిర్ణయానికి ప్రభుత్వ అధికారులూ, నిర్మాణ నిపుణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇదే బాటలో మిగతా సంఘాలూ పయనించి.. యూడీఎస్ పథకానికి వ్యతిరేకంగా ప్రకటనల్ని విడుదల చేస్తే.. మన రాష్ట్రంలో యూడీఎస్ మహమ్మారిని తరిమికొట్టినట్లు అవుతుంది.