Wednesday, December 4, 2024

క‌టీఫ్‌…! కూట‌మిలో క‌ల‌వ‌రం … ఢిల్లీలో ఆప్ ఒంటరి పోరు

ఇప్ప‌టికే మ‌హరాష్ట్ర‌తో పాటు ప‌లు రాష్ట్రాల్లో ఓట‌మపాలై.. మేక‌పోతు గాంభీర్యం ప్ర‌ద‌ర్శిస్తున్న కాంగ్రెస్ కూట‌మికి కేజ్రీవాల్ షాక్ ఇచ్చారు. రానున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు ఉండదని ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్) జాతీయ కన్వీనర్‌ అరవింద్ కేజ్రీవాల్‌ స్పష్టం చేశారు. తాము ఒంటరిగానే బరిలోకి దిగుతామని వెల్లడించారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అరవింద్ కేజ్రీవాల్ ఇలాంటి ప్రకటన చేయడంతో ఇండియా కూటమికి పెద్ద ఎదురుదెబ్బ తగిలినట్లు అయ్యింది. “ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్‌ పొత్తులకు దూరంగా ఉంటుంది. ఒంటరి పోరుకు మేము సిద్ధం అవుతున్నాం” అని కేజ్రీవాల్‌ స్పష్టం చేశారు. వాస్తవానికి ఇంతకు ముందే, ఢిల్లీ ఎన్నికల్లో పొత్తు లేకుండా చేస్తామని కాంగ్రెస్‌ కూడా ప్రకటించింది.

కలిసి పోటీ చేసినా లాభం లేదు
వాస్తవానికి ఈ ఏడాది ప్రారంభంలో దిల్లీలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఆప్‌, కాంగ్రెస్ రెండూ కలిసి పోటీ చేశాయి. కానీ ఒక్క సీటు కూడా గెలవలేకపోయాయి. మొత్తం లోక్‌ సభ స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంది. అలాగే ఈ ఏడాది పంజాబ్‌లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తుపెట్టుకోవడానికి ఆప్‌ నిరాకరించి, 13 స్థానాల్లో ఒంటరిగా బరిలోకి దిగింది. ఇక హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇరుపార్టీల మధ్య సీట్ల సర్దుబాటు కుదరలేదు. దీంతో కాంగ్రెస్‌తో క‌లిసి పోటీ చేస్తే పెద్ద‌గా ప్ర‌యోజ‌నం లేద‌ని అటు ఆప్ భావిస్తుండ‌గా.. ఆప్ తో లాభం లేద‌ని ఇటు కాంగ్రెస్ కూడా లెక్క‌లు వేస్తున్న‌ది.

కాంగ్రెస్ కూడా..!
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో హస్తం పార్టీ కూడా ఒంటరి పోరుకు సిద్ధమైంది. సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా కూటమి భాగస్వామిగా ఆమ్‌ ఆద్మీ పార్టీ కాంగ్రెస్‌ తో పొత్తు పెట్టుకున్నా అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తుకు ససేమిరా అంటోంది. దీంతో కాంగ్రెస్‌ పార్టీ ఒంటరిగానే పోటీ చేయాలనే నిర్ణయానికి వచ్చింది. ఢిల్లీ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు దేవేందర్‌ యాదవ్ కూడా ఈ ఎన్నికల్లో పోటీపై క్లారిటీ ఇచ్చారు. తాము అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీతో పొత్తు పెట్టుకోవడం లేదని, ఒంటరిగానే 70 స్థానాలకు పోటీ చేస్తున్నామని వెల్లడించారు. అధికార ఆమ్‌ ఆద్మీ పార్టీ ఇప్పటికే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల మొదటి జాబితా రిలీజ్‌ చేయడం, పొత్తుపై కాంగ్రెస్‌ తో సంప్రదింపులకు సంసిద్ధంగా లేకపోవడంతోనే కాంగ్రెస్‌ ఒంటరిపోరుకు రెడీ అయినట్టు తెలుస్తోంది. ఈసారి ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే లక్ష్యంతో బీజేపీ ప్రయత్నాలు మొదలు పెట్టింది. వచ్చే ఏడాది జనవరిలోనే ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్నాయి. ఢిల్లీ లిక్కర్‌ కేసులో అరెస్ట్‌ అయి బెయిల్‌ పై విడుదలైన అర్వింద్‌ కేజ్రీవాల్‌ సీఎం ఆఫీస్‌ కు వెళ్లొద్దని, కీలక నిర్ణయాలు తీసుకోవద్దని బెయిల్‌ నిబంధనల్లో ప్రతిబంధకాలు పెట్టారు. దీంతో ఆయన సీఎం పదవికి రాజీనామా చేసి పార్టీ సీనియర్‌ నాయకురాలు అతిశీని సీఎం చేశారు. తాను సీఎంగా విధులు నిర్వర్తించాలో లేదో ప్రజల దగ్గరికే వెళ్లి తేల్చుకుంటానని కేజ్రీవాల్‌ సీఎం పదవికి రాజీనామా చేయడానికి ముందే ప్రకటించారు. హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్‌ తో పొత్తు పెట్టుకోకపోవడంతోనే కాంగ్రెస్‌ పార్టీ బొక్కబోర్లా పడింది. ఇప్పుడు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిపోరు ఆ పార్టీకి లాభం చేస్తుందా? చేటు తెస్తుందా అనేది చూడాల్సి ఉంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

అధికారంలోకి వచ్చాక వడ్డీతో సహా చెల్లిస్తాం అన్న కేటీఆర్ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..!
- Advertisment -

Most Popular