కాంగ్రెస్ భగ్గుమన్న విభేదాలు

Differences in Congress leaders

  • ఉత్తమ్, కుంతియాలపై సర్వే దూషణలపర్వం
  • అడ్డుకోబోయిన బొల్లు కిషన్ పై దాడికి యత్నం
  • పార్టీ నుంచి సర్వే సత్యనారాయణ సస్పెన్షన్

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలో విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. అసలే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలై నైరాశ్యంలో ఉన్న కాంగ్రెస్ శ్రేణులకు తాజా పరిణామాలు మరింత మంట తెప్పిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమిపై జరిగిన సమావేశంలో నేతలు కొట్టుకునే వరకు పరిస్థితి వెళ్లడంతో విస్మయం వ్యక్తంచేస్తున్నారు. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జి కుంతియాలపై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ.. అనుచిత వ్యాఖ్యాలు చేయడంతో మొదలైన రగడ బాహాబాహి వరకు దారితీసింది. ఉత్తమ్‌ అధ్యక్షతన ఆదివారం గాంధీ భవన్‌లో హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజిగిరి, చేవెళ్ల లోక్‌సభ నియోజకవర్గాల సమావేశం జరిగింది. ఈ భేటీకి కుంతియాతోపాటు ఏఐసీసీ కార్యదర్శులు బోసురాజు, సలీం అహ్మద్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సర్వే సమావేశంలో తీవ్ర వ్యాఖ్యలు చేసినట్టు తెలిసింది. పార్టీ ఓటమిపై సమీక్షించే హక్కు కుంతియా, ఉత్తమ్‌లకు లేదని.. కుంతియా టికెట్లు అమ్ముకున్నారని, పార్టీ అభ్యర్థులకు ఆర్థిక సాయం విషయంలోనూ నష్టం చేశారని ఆరోపించినట్టు సమాచారం. ఆయన కారణంగానే పార్టీ ఓడిపోతే మళ్లీ ఆయనే సమీక్షలు నిర్వహించడమేంటని నిలదీసినట్టు తెలిసింది. ఈ సందర్భంగా ఉత్తమ్, కుంతియాలను సర్వే అనుచిత పదజాలంతో దూషించడంతో ఆయన్ను అడ్డుకునేందుకు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి బొల్లు కిషన్‌ ప్రయత్నించారు. దీంతో ఆగ్రవేశాలకు గురైన సర్వే.. తన చేతిలో ఉన్న వాటర్‌ బాటిల్‌తో కిషన్‌పై దాడి చేశారు. దీంతో కిషన్ కూడా ఎదురుతిరిగారు. సర్వేతో బాహాబాహీకి దిగడంతో.. ఇతర నేతలు వెంటనే కల్పించుకుని వారిని అడ్డుకున్నారు. సర్వేను సమావేశం నుంచి బయటకు పంపించారు. అనంతరం సర్వే సత్యనారాయణను కాంగ్రెస్ నుంచి సస్పెండ్ చేసినట్టు పార్టీ క్రమశిక్షణా వ్యవహారాల కమిటీ ప్రకటించింది. అయితే, తాను సోనియాకు మాత్రమే విధేయుడినని, వీరెవరికీ కాదని సర్వే వ్యాఖ్యలు చేశారు. ఉత్తమ్, కుంతియాలు టీఆర్ఎస్ కోవర్టులు అని.. ఎన్నికల్లో టికెట్లు అమ్ముకున్నారని ఆరోపణలు చేశారు. త్వరలోనే పూర్తి ఆధారాలతో వారిపై అధిష్టానానికి ఫిర్యాదు చేస్తానని పేర్కొన్నారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article