టీడీపీ లో చేరిన సినీనటి దివ్య వాణి

ఎన్నికలకు సమయం దగ్గరపడడంతో అధికార తెలుగుదేశం పార్టీ స్పీడు పెంచేసింది. ఇన్ని రోజులు అభివృద్ధిపైనే దృష్టి సారించిన ఆ పార్టీ అధిష్ఠానం.. ప్రస్తుతం పార్టీని బలోపేతం చేసేందుకు ప్రయత్నాలు సాగిస్తోంది. ఇందులో భాగంగానే చేరికలపై దృష్టి సారించింది. టీడీపీలో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్న వారితో ఆ పార్టీ నేతలు మంతనాలు జరుపుతున్నారు. రాజకీయ రంగానికి చెందిన వారినే కాకుండా ఇతర రంగాలకు చెందిన వారని కూడా ఆ పార్టీ నేతలు సంప్రదిస్తున్నారు. స్వచ్ఛందంగా టీడీపీలోకి రావాలనుకుంటున్న వారిని కూడా పార్టలోకి ఆహ్వానిస్తున్నారు. ఈ కోవకే చెందిన ప్రముఖ సినీ నటి దివ్యవాణి తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకున్నారు. టాలీవుడ్‌‌లో ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన ఆమె టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. సోమవారం సాయంత్రం సీఎం చంద్రబాబు సమక్షంలో దివ్యవాణి టీడీపీ కండువా కప్పుకున్నారు. పార్టీని బలోపేతం చేసేందుకు ప్రయత్నాలు చేస్తానని చెబుతున్న ఆమెకు అధికార ప్రతినిధి పదవి ఇచ్చే ఛాన్స్ ఉంది.

ఇదిలా ఉండగా, దివ్య వాణి కొద్దిరోజుల క్రితమే తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలిపారు. ఇందులో భాగంగానే గత నవంబర్‌లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుతో ఆమె భేటీ అయ్యారు. ఉండవల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో ఆమె తెలుగుదేశం పార్టీపై, చంద్రబాబు నాయకత్వంపై తన అభిప్రాయాలను పంచుకున్నారు. ఈ భేటీ తర్వాత దివ్య వాణి మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబుపై ప్రశంసల వర్షం కురిపించారు. చంద్రబాబు దార్శనికత వల్ల ఏపీ ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. ఈమెతో పాటు మరో నటి వాణి విశ్వనాథ్ కూడా టీడీపీలో చేరుతారని తెలుస్తోంది. కేరళలో పుట్టి తమిళ, మలయాళ, కన్నడ చిత్రాల్లోనూ నటించిన ఆమెకు టాలీవుడ్‌లో బ్రేక్‌ వచ్చింది. దీంతో ఆమె ఇక్కడ బాగా పాపులర్ అయిపోయారు. అప్పటి నుంచి తెలుగు రాష్ట్రమన్నా.. ఇక్కడ ప్రజలన్నా ఆమెకు చాలా ఇష్టమని పలుమార్లు ప్రకటించారు. అయితే, ఆమెకు రాజకీయాల్లో మాత్రం చంద్రబాబు అంటే చాలా ఇష్టమని, ఆయన ఓకే అంటే టీడీపీలో చేరుతానని ఆమె గతంలో ప్రకటించారు. అంతేకాదు పార్టీ ఆదేశిస్తే వైసీపీ ఎమ్మెల్యే రోజాపై పోటీకి సిద్ధమని కూడా తెలిపారు. చంద్రబాబు నిర్ణయం కోసం వేచి చూస్తున్నారట వాణీ విశ్వనాథ్.

divyavani joined tdp

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article