విజయవాడలో ఆంధ్రప్రదేశ్ పంచాంగకర్తల సమాఖ్య ఆవిర్భావ మహోత్సవానికి విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతీ స్వామి హాజరయ్యారు. ఈ సందర్బంగా పంచాంగకర్తల ను ఉద్దేశించి స్వామీజీ మాట్లాడారు. పండుగ తేదీల విషయంలో పంచాంగకర్తలు పరస్పర విరుద్ధ ప్రకటనలు చేయవద్దని సూచించారు. ఒకే పండుగపై ఒక్కో పంచాంగంలో ఒక్కో తేదీని ప్రకటించడం వల్ల హేతువాదులు విమర్శించడానికి ఆస్కారం ఏర్పడుతోందన్నారు. తద్వారా టీవీ డిబేట్లకు తావు ఏర్పడుతోందని స్పష్టం చేసారు. ఈ పరిస్థితిని అధిగమించాలంటే పంచాంగకర్తలంతా కలిసి ఏకీకృత పంచాంగాన్ని రూపొందించాల్సిన అవసరం ఉందని గుర్తుచేశారు. ఈ విషయంలో విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర సరస్వతీ స్వామి సహకరిస్తారని, పంచాంగకర్తలంతా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. పంచాంగకర్తలంతా కలిసి ఒక సమాఖ్యగా ఏర్పడటం ముదావహమని స్వాత్మానందేంద్ర స్వామి అన్నారు. ఈ కార్యక్రమంలో దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ తెలుగు మరియు సంస్కృత అకాడమీ ఛైర్ పర్సన్ లక్ష్మీ పార్వతి, ప్రముఖ పంచాంగ కర్తలు పాల్గొన్నారు.