DOCTORS SUFFERED
- ఎంబీబీఎస్ డాక్టర్లకు రూ.25వేల లోపే జీతాలు
- పీజీ లేదా స్పెషలైజేషన్ లేకుంటే కష్టాలే
డాక్టర్ చదివేస్తే.. బోలెడు డబ్బులు.. రెండు చేతులా ఎడాపెడా సంపాదించేయొచ్చు. పేషెంట్ల దగ్గర నుంచే కాకుండా ఫలానా మందులే రాసిచ్చినందుకు ఆ కంపెనీ నుంచి కమీషన్లు.. ల్యాబ్ పరీక్షల్లో పర్సంటేజీలు.. ఇలా దండిగా వెనకేసుకోవచ్చు. ఇదీ జనబాహుళ్యంలో ఉన్న సాధారణ అభిప్రాయం. కానీ నాణేనికి రెండో వైపు కూడా ఉంటుంది. లక్షలు లక్షలు ఫీజులు కట్టిన తమకు వస్తోంది నెలకు కేవలం పాతిక వేలేనని పలువురు వైద్యులు వాపోతున్నారు. పేరుకే ఎంబీబీఎస్ డాక్టర్ అని, తమ పరిస్థితి నర్స్ కంటే అధ్వానంగా ఉందని, తమకంటే ఆర్ఎంపీలే మెరుగ్గా సంపాదించుకుంటున్నారని అంటున్నారు. డాక్టర్ అని గొప్పగా చెప్పుకోవడమే తప్ప వేతనాలు కనీస స్థాయిలో కూడా లేవంటూ ఆందోళన చెందుతున్నారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో తగినంత వేతనాలు లేకపోవడం, ప్రభుత్వ రంగంలో డిమాండ్‌కు సరిపడినన్ని ఉద్యోగాలు లేకపోవడంతో పరిస్థితి దారుణంగా ఉందని వాపోతున్నారు. మండలాలు, గ్రామాల్లో ప్రాక్టీస్ పెట్టినా స్థానికంగా ఉండే సమస్యలతో సతమతం అవుతున్నామని అంటున్నారు. ఎంబీబీఎస్ చదువు ఎందుకూ పనికిరాకుండా పోతోందని వ్యాఖ్యానిస్తున్నారు. ఇక విదేశాల్లో ఎంబీబీఎస్ చేసిన విద్యార్థులు అనేకమంది ఎంసీఐ అర్హత పరీక్ష పాసు కాకపోవడంతో వారికి ఇస్తున్న వేతనాలు రూ.20 వేలకు కూడా మించడంలేదు. దీంతో వారి పరిస్థితి మరింత ఘోరంగా మారింది. పీజీ, సూపర్ స్పెషాలిటీ చదవకుంటే మార్కెట్‌లో కనీస గుర్తింపు ఉండడంలేదట. కేవలం ఎంబీబీఎస్‌తో వృత్తిలో ఎదిగే పరిస్థితి లేదని చెబుతున్నారు. ఒకవేళ ప్రైవేటులో పీజీ చేయాలన్నా కోట్లలో డొనేషన్లు చెల్లించాల్సి వస్తుంది. పీజీలో సీటు రాక, ఎంబీబీఎస్ ద్వారా ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రిలో తక్కువ వేతనాలకు పనిచేయలేక దిక్కు తోచని స్థితిలో ఉన్నామని వాపోతున్నారు. మొత్తమ్మీద వైద్యులకూ వేతన వెతలు తప్పడంలేదు.