Donald Trump will discuss CAA & NRC with Modi
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తొలిసారి భారత్ రానున్న నేపథ్యంలో ఆయన పర్యటనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది .ఇక ట్రంప్ పర్యటన కోసం భారత్ ప్రభుత్వం అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తోంది.ఫిబ్రవరి 24, 25 తేదీల్లో ట్రంప్,ఆయన సతీమణి మెలనియా భారత పర్యటన చేయనున్నారు. ఇక ఈ టూర్‌పై అగ్రరాజ్యం అధినేత కూడా ఎంతో ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే సోషల్ మీడియా వేదికగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇకపోతే ట్రంప్, మోదీ భేటీలో ఇరువురూ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారన్న వాటిపై ఇరుదేశాల ఇన్వెస్టర్లు కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ పర్యటనలో ట్రంప్ మోదీని పలు కీలక అంశాలపై వివరణ అడగనున్నారని తెలుస్తోంది. అత్యంత వివాదాస్పదంగా మారిన సీఏఏ, ఎన్నార్సీ, ఎన్పీఆర్ చట్టాలపై ఆయన ప్రధానిని అడిగే అవకాశం ఉందని సమాచారం. అటు భారతీయ ప్రజాస్వామ్య సంప్రదాయాలు, మతపరమైన స్వేచ్ఛ గురించి కూడా ట్రంప్ చర్చిస్తారని వైట్ హౌస్ సీనియర్ అధికారి ఒకరు స్పష్టం చేశారు. మత స్వేచ్ఛకు అగ్రరాజ్యం ఎంతో ప్రాధాన్యాన్ని ఇస్తుంది. అయితే మోదీ సర్కార్ ప్రవేశపెట్టిన సీఏఏ మాత్రం మత స్వేచ్చకు పరీక్ష పెట్టేలా ఉందని వారు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
2015కు ముందు భారత్‌కు పొరుగున ఉన్న మూడు దేశాల్లో వివక్ష, వేధింపులను ఎదుర్కొని ఇండియాకి వచ్చిన మైనార్టీలకు భారత పౌరసత్వాన్ని కల్పించడం కోసమే సీఏఏ చట్టాన్ని అమలులోకి తీసుకొచ్చారు. అయితే ఇది ముస్లింల పట్ల వివక్ష చూపించే విధంగా ఉందని ప్రతిపక్షాలు ఆరోపించాయి. కాగా, ఈ భేటీలో మైనార్టీల హక్కులను పరిరక్షించాలని ట్రంప్ మోదీని కోరే అవకాశం ఉందని తెలుస్తోంది. మొత్తానికి ఇండియాకు రాబోతున్న ట్రంప్ మోడీని ఏం అడగనున్నారు అన్నది మాత్రం ఆసక్తికర చర్చకు కారణం అవుతుంది .