44 అంతస్తులూ ప్రీ లాంచ్.. ఎంత దారుణం?

Dont Encourage Pre Launches

ఏవో ముక్కు మోహం తెలియని సంస్థలు.. నిన్న కాక మొన్న వచ్చిన కంపెనీలు.. రెరా నిబంధనలకు విరుద్ధంగా ఫ్లాట్లను విక్రయిస్తున్నాయంటే ఒక మాట. వాళ్లకు మార్కెట్లో పెద్దగా పరిచయాలు ఉండకపోవచ్చు.. అంత క్రెడిబిలిటీ కూడా లేకపోవచ్చు. ఇప్పుడిప్పుడే నిర్మాణ రంగంలోకి ఎంతో ఉత్సాహంతో వచ్చి ఉండొచ్చు. అందుకే.. తెలిసో, తెలియకో నియమ నిబంధనల్ని పాటించడం లేదని అనుకోవచ్చు. దారుణమైన విషయం ఏమిటంటే..  ముప్పయ్, నలభై అంతస్తుల ఎత్తులో టవర్లను నిర్మించే కంపెనీలూ ప్రీ లాంచ్ లో ఫ్లాట్లను విక్రయిస్తున్నాయి. మార్కెట్లో పేరెన్నిక గల సంస్థలే రెరా నిబంధనలకు విరుద్ధంగా.. ఇలా అడ్డగోలుగా ఫ్లాట్లను విక్రయిస్తుంటే ఏమనుకోవాలి? వీళ్లకు రెరా చట్టం గురించి తెలియదనుకోవాలా? ప్రీ లాంచ్ లో ఫ్లాట్లు అమ్మవద్దని అర్థం కావడం లేదనుకోవాలా? తెలంగాణ రెరా అథారిటీ లోగో, నెంబరును  ప్రతి ప్రకటన మీద వేయాలనే కనీస జ్నానం కూడా ఈ సంస్థలకు లేదా అని కొనుగోలుదారులు ప్రశ్నిస్తున్నారు.

ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో ఒక సంస్థ 44 అంతస్తుల ఎత్తులో రెండు టవర్లను నిర్మించడానికి ప్రణాళికల్ని రచించింది. స్కై స్క్రేప్ విల్లాల్ని ప్రీ లాంచ్లో విక్రయిస్తున్నామంటూ ఎంచక్కా ఇన్ స్టాగ్రామ్ లో ప్రకటనల్ని  విడుదల చేసింది. అన్నీ మూడు అంతస్తుల ఫ్లాట్లే కావడంతో.. ఒక్కో ఫ్లాట్ ఆరంభ ధర ప్రీ లాంచ్ లో రూ.1.30 కోట్లు అని ప్రకటించింది. చూడటానికిదో పెద్ద సంస్థ అనిపిస్తోంది. మరి, ఇంత భారీ ప్రాజెక్టులనూ ఇలా రెరా నిబంధనలకు విరుద్ధంగా ప్రీ లాంచ్ లో ఫ్లాట్లను విక్రయించడం సమంజసమేనా? ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించే కంపెనీల సభ్యత్వాల్ని నిర్మాణ సంఘాలు ఎందుకు తొలగించకూడదు? ఇలాంటి సంస్థల పట్ల ఎందుకు ఉదాసన వైఖరీని అవలంబిస్తున్నాయి? రెరా నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించే నిర్మాణాల జాబితాను తెలంగాణ రెరా అథారిటీ సేకరిస్తుందని తెలిసింది.

పొద్దున లేస్తే ప్రభుత్వం, ప్రభుత్వ అధికారులతో నిత్యం టచ్ లో ఉండే సంఘ పెద్దలు ఎందుకు తమ సభ్యుల్ని ప్రీ లాంచ్ అమ్మకాల విషయంలో నియంత్రించడం లేదు? ప్రతి సంఘం కోడ్ ఆఫ్ కండక్ట్ ను అమలు చేయడం లేదెందుకు? ఇలాంటి ప్రకటనలు చూసి ఫ్లాట్లు కొన్న తర్వాత సదరు బిల్డర్ ఆయా ఫ్లాట్లను కొనుగోలుదారులకు అందించకపోతే ఎలా? ఆ సంస్థతో పాటు నిర్మాణ సంఘం కూడా అప్రతిష్ఠపాలవుతుందా? లేదా? ఈ అంశాన్ని నిర్మాణ సంఘాలు అంచనా వేస్తున్నాయా? లేదా? కాబట్టి, నిర్మాణ సంఘాలు వెంటనే యూడీఎస్, ప్రీ లాంచుల మీద స్పందించాలి. ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించే నిర్మాణ సంస్థల సభ్యత్వాన్ని తక్షణమే రద్దు చేయాలి. ఆ విషయాన్ని బహిరంగంగా తెలియజేయాలి. ఇలాంటి కఠిన చర్యలు తీసుకోకపోతే, నిబంధనల్ని పాటిస్తూ నిర్మాణాల్ని చేపట్టే నగర సంస్థలు ఈ రంగంలో నుంచి నిష్క్రమించే అవకాశం లేకపోలేదు.

Hyderabad Pre Launch Sales

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article