DS, KK MAY JOIN BJP
తెలంగాణలో కాంగ్రెస్, టీఆర్ఎస్ ఎంపీలు త్వరలో తమ పార్టీలో చేరబోతున్నారంటూ కేంద్ర మాజీమంత్రి, బీజేపీ సీనియర్ నేత దత్తాత్రేయ సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం ఓ కార్యక్రమానికి హాజరైన దత్తన్న.. మీడియాతో మాట్లాడుతూ టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం బీజేపీయేనని అభిప్రాయపడ్డారు. కవిత, వినోద్ ఓటమితో సీఎం చంద్రశేఖర్ రావు పతనం ప్రారంభమైందని చెప్పారు. డీఎస్‌తో పాటు చాలామంది నేతలో త్వరలోనే బీజేపీలో చేరబోతున్నారంటూ రాజకీయ వర్గాల్లో అలజడి సృష్టించారు. తెలంగాణలో రెవెన్యూశాఖతో పాటు మిగిలిన అన్ని శాఖల్లోనూ అవినీతి రాజ్యమేలుతోందని దత్తాత్రేయ ఆరోపించారు.
దక్షిణాదిన పాగా వేయాలని ఎప్పటి నుంచో భావిస్తున్న బీజేపీకి గత ఎన్నికల్లో సొంతంగా పూర్తి మెజారిటీ రావడంతో ఆకాశమే హద్దుగా రాజకీయాలను శాసిస్తోంది. గోవాలో పది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీలో కలిసిపోయారు. ఇక ఏపీ, తెలంగాణలో కూడా ఇతర పార్టీల్లోని నేతలను ఆకర్షించే పనిలో బీజేపీ నేతలు ఉన్నట్లు తెలుస్తోంది. ఐతే గెలాబీ పార్టీకి రెండోసారి గెలుపు కిక్ ఇచ్చినా, ఎందుకో లక్ దూరమవుతోంది. సెంటిమెంట్ చేతిలో ఉండగా మనకేంటీ సాటి అనుకున్న చంద్రశేఖర్ రావు ఇప్పుడు ఆత్మరక్షణలో పడే పరిస్థితికి వచ్చింది. ఇదంతా స్వయంకృతమా.. రాజకీయ వ్యూహంలో భాగమా అనే అంశాలను పక్కనబెడితే.. గులాబీ బాస్‌కు గుబులు మొదలైంది. ఇది చాలదన్నట్టుగా మొన్న ఎంపీగా కవిత ఓటమి. రెండోసారి మంత్రి పదవి ఇవ్వకపోవటం వల్ల హరీష్‌రావు నుంచి ఏదైనా ఆపద వస్తుందనే భయం వెంటాడుతూనే ఉంది. అంతే కాకుండా రాజకీయంగా తనను తాను ఎక్కువగా అంచనా వేసుకున్నదంతా ఒట్టిదేనా అనే అనుమానాలు కూడా గులాబీగూటిలో మొదలయ్యాయి. తాజాగా మాజీ ఎంపీపీ శ్రీనివాసరావును నక్సల్స్ హత్య చేయటం కూడా రాజకీయ నేతల్లో ముఖ్యంగా అధికా పార్టీలో కలకలం రేకెత్తిస్తోంది. ఇవన్నీ పక్కనబెడితే.. రామగుండం మాజీ ఎమ్మెల్యే సోమావరపు సత్యనారాయణ రాజీనామా చేసి బీజేపీ కోటరీలోకి చేరారు.
డీఎస్ బీజేపీలోకి ఖాయమా?
ఒకప్పుడు కాంగ్రెస్‌లో ఓ వెలుగు వెలిగిన ధర్మపురి శ్రీనివాస్ అలియాస్ డీఎస్ గులాబీ గూటికి చేరినా ఎందుకో ఇమడలేకపోయాడు. చంద్రశేఖర్ రావు కూతురు కవిత కూడా డీఎస్ నాయకత్వాన్ని జీర్ణించుకోలేకపోయింది. డీఎస్ తనయుడు అరవింద్ బీజేపీలో ఉండటాన్ని సహించలేకపోయారు. డీఎస్ కూడా తనయుడికే వత్తాసు పలుకుతూ.. టీఆర్ఎస్ కు ద్రోహం చేస్తున్నాడంటూ కవిత వర్గం ఫిర్యాదు చేసేంత వరకూ చేరింది. పార్టీ నుంచి తొలగించాలనుకున్నా వర్గ సమీకరణల నేపథ్యంలో చంద్రశేఖర్ రావు ఏ నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. మొన్నటి ఎన్నికల్లో డీఎస్ తనయుడు గెలుపు పుండుమీద కారం చల్లినట్టుగా మారింది. తాజాగా జరిగిన టీఆర్ఎస్ పార్లమెంటరీ సభ్యుల సమావేశానికి డీఎస్ రావటం చర్చనీయాంశమైంది. అయితే అది సెల్‌ఫోన్ మెసేజ్ అందటం వల్ల జరిగిన తప్పిదంగా గులాబీపార్టీ వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. డీఎస్ తాను కోరుకున్నదే టీఆర్ఎస్ చేయటంతో పార్టీను వీడతారనే ఊహాగానాలు మొదలయ్యాయి.
కేకే చూపు బీజేపీ వైపు..
మూడో నేత కేకే.. ఈయన కూడా ఒకప్పుడు కాంగ్రెస్‌లో సీనియర్ నేతే. కూతురుని ఖైరతాబాద్ ఎమ్మెల్యే చేయాలనుకున్నా ఎందుకో వర్కవుట్ కాలేదు. పైగా పార్టీలో ప్రాభల్యం కూడా తగ్గటం కలచివేసిందట. దీంతో తాను కూడా రెండు మూడ్రోజుల్లో కారు దిగవచ్చని ప్రచారం జరుగుతుంది… ఈ ముగ్గురు నేతలు మూడు ప్రాంతాలకు చెందిన వారే అయినా.. ఒక్క కామన్ పాయింట్ మాత్రం గులాబీపార్టీలో గుబులు రేకెత్తిస్తోంది. అదేమిటంటే.. ముగ్గురూ మున్నూరు కాపు సామాజికవర్గానికి చెందిన వారు కావటమే, ఏపీలో కాపులను.. తెలంగాణలో మున్నూరు కాపులను ఏకతాటిపైకి తీసుకురావటం ద్వారా బీజేపీ తాను చేయదలచుకున్నది చేయబోతుందనే వాదనకు బలం చేకూరినట్టుంది.
BJP CREATES HAVOC IN TELANGANA