దుబ్బాకలో ఏం జరుగుతోంది?

76
Dubbaka bypole Election
Dubbaka bypole Election

Dubbaka bypole Election

ఉప ఎన్నిక నోటిఫికేషన్ వెలువడగానే దుబ్బాకలో రాజకీయ వేడి సంతరించుకుంది. అన్ని పార్టీలు దుబ్బాకను కైవసం చేసుకునేందుకు పావులు కదుపుతున్నాయి. పార్టీలు అభ్యర్థులను ప్రకటించడం, ముఖ్య నాయకులు పార్టీలు మారడం, అసమ్మతి పుట్టుకురావడం లాంటి విషయాలు చోటుచేసుకోవడంతో ప్రతిఒక్కరూ దుబ్బాక గురించి చర్చించుకుంటున్నారు. అసలు దుబ్బాకలో ఎవరు గెలుస్తారు? ఏ పార్టీకి మెజార్టీ వస్తుంది? అభ్యర్థుల వ్యూహాలేంటి? దుబాక ప్రజల మళ్లీ టీఆర్ఎస్ కు పట్టం కడతారా? లాంటి ఆసక్తికర విషయాలు ప్రతిఒక్కరిని రేకెత్తిస్తున్నాయి. ఒక్కసారి దుబ్బాక రాజకీయాలను పరిశీలిస్తే…

సోలిపేట రామలింగారెడ్డి మరణంతో దుబ్బాక ఉప ఎన్నిక అనివార్యమైంది. అయితే ఊహించినట్టుగానే సోలిపేట సుజాతను టీఆర్ఎస్ అభ్యర్థిగా ఖరారు చేశారు ముఖ్యమంత్రి కేసీఆర్. మాజీ ఎమ్మెల్యే, దివంగత సోలిపేట రామలింగారెడ్డి భార్య సోలిపేట సుజాత. రామలింగారెడ్డి తెలంగాణ ఉద్యమంలో ముఖ్య పాత్ర పోషించారు. ఉద్యమం, పార్టీ కోసం అంకిత భావంతో పని చేశారు. రామలింగారెడ్డి కుటుంబం ఉద్యమంలో కూడా పాల్గొంది. అందుకే సీఎం కేసీఆర్ సోలిపేట సుజాతను బరిలో దింపారు. రామలింగారెడ్డి కుటుంబ సభ్యులే ప్రాతినిథ్యం వహించడం సమంజసం అని సీఎం కూడా అన్నారు.

రంగంలోకి ట్రబుల్ షూటర్

ఏ ఎన్నిక జరిగినా భారమంతా హరీశ్ రావుపైనే పడుతోంది. ఈ సారి కూడా హరీశ్ రావు అన్ని తానై వ్యవహరించనున్నారు. 2014, 2018 ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీకి వరుసగా 37,925,  62,500 మెజార్టీ వచ్చింది. అయితే ఈ ఉప ఎన్నికలో లక్ష ఓట్ల మెజార్టీ లక్ష్యంగా హరీశ్ రావు పావులు కదుపుతున్నట్లు, టీఆర్ఎస్ కు ఓట్లు వేస్తేనే మరిన్ని పథకాలు తీసుకొస్తానని కింది స్థాయిలో నేతలతో చెప్పినట్లు తెలుస్తోంది. మరి హరీశ్ రావు టార్గెట్ చేరుకుంటాడనేది త్వరలో తేలనుంది. అయితే ఈ ఎన్నికల్లో గెలుపు ఓటములపై కాకుండా, టీఆర్ఎస్ మెజార్టీపై ఫోకస్ చేయనుంది. గత ఎన్నికల్లో వచ్చిన ఓట్లకు మించి ఈ ఎన్నికల్లో మెజార్టీ సాధించాలని కేసీఆర్‌ భావిస్తున్నట్లు తెలుస్తోంది. టీఆర్ఎస్ అధినేత సూచించగానే రంగంలోకి దిగారు హరీశ్ రావు. ఇప్పటికే నియోజకవర్గంలోని ఏడు మండలాల్లోని దాదాపుగా అన్ని గ్రామాలను పర్యటించారు. కుల సంఘాలు, మహిళా సంఘాలు, యువతతో సమీక్షలు, సభలు నిర్వహంచి టీఆర్‌ఎస్‌కు ఓటు వేయాలని కోరారు. భారీ మెజార్టీతో టీఆర్‌ఎస్‌ను గెలిపించి అధినేతకు బహుమతిగా ఇవ్వాలని క్యాడర్‌కు పిలుపు నిచ్చారు. ప్రచారంలో భాగంగా ఇప్పటికే హరీశ్ రావు సోలిపేట సుజాత ఇంటికి వెళ్లి మరి ఆహ్వానం పలికాడు. అయితే దుబ్బాకలో రామలింగారెడ్డికి మంచి పేరుందని, దుబాక ప్రజలు సెంటిమెంట్ గా భావించి సుజాతనే గెలిపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.

చెరుకు చేరికతో కాంగ్రెస్ కు బలం

టీఆర్‌ఎస్‌ టికెట్‌ ఆశించిన చెరుకు శ్రీనివాస్‌రెడ్డికి కాంగ్రెస్‌ ఆఫర్‌ ఇచ్చింది. టికెట్‌ ఇస్తాం… పోటీ చేయాలంటూ… శ్రీనివాస్‌రెడ్డితో మంతనాలు జరుపుతున్నారు కాంగ్రెస్‌ నేతలు. అయితే టీఆర్ఎస్ అభ్యర్థిగా సుజాత పేరు ఖరారు కావడంతోచెరుకు శ్రీనివాస్‌రెడ్డి కాంగ్రెస్ వైపు చూశారు. చెరుకు శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీలో నిల్చోవడంతో దుబ్బాక ఎన్నిక రసవత్తరంగా ఉండబోతోంది. పార్టీ చీఫ్ మాణిక్కంతో పాటు టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి మరియు ముఖ్య నాయకులు ఎప్పటికప్పుడు దుబ్బాక పరిస్థితిని సమీక్షిస్తున్నారు. గతంలో చెరుకు శ్రీనివాస్ రెడ్డి టికెట్ ఆశించి భంగపడ్డారు. ఈసారైనా ఎలాగైనా గెలువాలనే ఆశయంతో ఉన్నారు. శ్రీనివాస్ రెడ్డి ముత్యంరెడ్డి కుమారుడు కావడం, టీఆర్ ఎస్ తో చాలా సార్లు భంగపడడంతో ఆయనకు దుబ్బాకలో సానుభూతి పవనాలు వీస్తున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ నాయకులు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటే చెరుకు కు గెలుపు కూడా ఉన్నాయి.

రఘునందన్ కు ఎదురుగాలి

ఎప్పుడైతే బీజేపీ అధిష్టానం రఘునందన్ రావు అభ్యర్థిగా ప్రకటించిందో… ఆరోజు నుంచే దుబ్బాక బీజేపీ ముసలం ప్రారంభమైంది. రఘునందర్‌రావును ఖరారు చేయడంపై స్థానిక బీజేపీ నేత తోట కమలాకర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రఘునందన్‌రావు లాంటి వ్యక్తికి పార్టీ టికెట్‌ ఇవ్వడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. దీనిపై పార్టీ అధిష్తానం పునరాలోచించాలని కమలాకర్‌రెడ్డి వ్యాఖ్యానించారు. బీజేపీ ప్రతిష్ట దెబ్బతింటోందని ఆయన మీడియా సమావేశంలో విమర్శలు గుప్పించారు. మరోవైపు తోట కమలాకర్‌రెడ్డిని పార్టీ నుంచి బీజేపీ తొలగిస్తూ ప్రకటన చేసింది. నిన్న పెద్దమొత్తంలో డబ్బు దొరకడంతోపాటు కమలాకరెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేయడంతో బీజేపీ గెలుపు కష్టమేనని భావిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. అయితే రఘునందన్ రావు మాత్రం వీటితో సంబంధం లేకుండా ప్రచారం చేస్తున్నారు. ఎప్పుడైతే రామలింగారెడ్డి చనిపోయారో… ఆ రోజు నుంచే రహస్య ప్రచారం చేసుకోవడం మొదలు పెట్టాడని దుబ్బాక ప్రజలు చెప్తున్నారు. మరోసారి రఘునందన్ ఓడిపోవడం ఖాయమేనని తెలుస్తోంది.

సీపీఐ దూరం

ఉప ఎన్నికకు సీపీఐ పోటీకి దూరంగా ఉండనుంది. అయితే ఉప ఎన్నికల్లో ఎవరికి మద్దతు ఇవ్వాల్లో పార్టీ త్వరలో నిర్ణయం తీసుకుంటుంది. పార్టీ నేత చాడ వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ బీజేపీని ఓడించడమే తమ లక్ష్యమన్నారు.

 

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here