Durgamcheruvu Cable bridge
దేశంలోనే అతిపెద్ద కేబుల్ బ్రిడ్జిగా అత్యంత ఆధునిక, సాంకేతిక పద్దతిలో నిర్మితమవుతున్న దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. రూ. 184 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న 754.38 మీటర్ల పొడవుగల బ్రిడ్జి నిర్మాణ పనుల్లో దుర్గంచెరువుకు ఇరువైపులా 20 మీటర్ల ఎత్తులో వంతెన నిర్మాణ పనులు పూర్తి కావడంతో పాటు సూపర్ స్టక్చర్ల నిర్మాణాలు కూడా పూర్తికావచ్చాయి. గుజరాత్ రాష్ట్రంలోని బరూచ్ జిల్లాలోని 144 మీటర్ల కేబుల్ బ్రిడ్జి ఇప్పటి వరకు అతి పెద్దదిగా ఉంది. దుర్గం చెరువుపై నిర్మాణం పూర్తయితే దేశంలో అతిపెద్ద కేబుల్ బ్రిడ్జిగా రికార్డు సృష్టించనుంది. 2019 అక్టోబర్ మాసంలోగా ఈ బ్రిడ్జి నిర్మాణ పనులను పూర్తి చేయాలనే లక్ష్యంతో జీహెచ్ఎంసీ ప్రాజెక్ట్ ఇంజనీరింగ్ విభాగం పనులను శరవేగంగా కొనసాగిస్తోంది. ఎక్స్‌ట్రా డోస్‌డ్ సాంకేతిక విధానాన్ని ఈ బ్రిడ్జి నిర్మాణంలో అవలంభిస్తున్నారు. దీంతో వంతెన ఎత్తు గణనీయంగా తగ్గడంతో పాటు చెరువుకు ఇరువైపులా బ్రిడ్జికి చెరువు మధ్యలో ప్రత్యేకంగా పిల్లర్‌ను నిర్మించకుండానే పూర్తిచేయనున్నారు. సాంప్రదాయ సాంకేతిక విధానంలో దుర్గంచెరువు బ్రిడ్జి నిర్మిస్తే 75 మీటర్ల ఎత్తులో పిల్లర్లను నిర్మించడంతో పాటు చెరువు మధ్యలో కూడా ఇదే ఎత్తులో సపోర్టింగ్‌గా మరో పెద్ద పిల్లర్‌ను నిర్మించాల్సి వచ్చేది. దీంతో ఎంతో ఎత్తుపై ఈ కేబుల్ బ్రిడ్జి మహానగరాల ప్రమాణాలకు విరుద్దంగా ఉండేది. ఎక్స్‌ట్రా డోస్ సాంకేతిక విధానం అవలంభించడంతో 75 మీటర్లకు బదులుగా కేవలం 57 మీటర్ల ఎత్తుకే ఈ వంతెన పరిమితమయ్యింది. ఈ విధమైన సాంకేతిక పద్దతిలో కేబుల్ బ్రిడ్జి వంతెన నిర్మించడం ప్రపంచంలో ఇది మూడవదని నగర మేయర్ బొంతు రామ్మోహన్ వెల్లడించారు. ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తితో మాధాపూర్, జూబ్లీహిల్స్‌ల మధ్య గణనీయంగా దూరం తగ్గడంతో పాటు రంగురంగుల విద్యుత్ కాంతులతో మొట్టమొదటి హైదరాబాద్ హ్యాంగింగ్ బ్రిడ్జిగా పేరొందడంతో పాటుగా మంచి పర్యాటక ప్రాంతంగా రూపొందనుంది. దీనికి స్టే-కేబుళ్లను ఆస్ట్రీయా దేశం నుండి ప్రత్యేకంగా తెప్పించడం జరిగింది. బ్రిడ్జి బిల్డర్ పనులు పురోగతిలో ఉండగా, ట్రాక్ భీం ఫ్యాబ్రికేషన్ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. దుర్గం చెరువుపై కేబుల్ బ్రిడ్జి ప్రీ కాస్టింగ్ పనులు కొండాపూర్‌లో జరుగుతున్నాయని మేయర్ తెలిపారు. 25మీటర్ల పొడవు 6.5 మీటర్ల ఎత్తుతో ఉండే ప్రధాన బ్రిడ్జి పనులు కొండాపూర్‌లో ప్రీ కాస్టింగ్ నిర్మాణ పద్దతిలో పురోగతిలో ఉన్నాయని తెలిపారు.
కేబుల్ బ్రిడ్జి నిర్మాణంతో కలిగే సౌకర్యాలు…
* హైటెక్ సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్‌కు కేబుల్ బ్రిడ్జి ప్రత్యేక ఐకానిక్‌గా రూపొందనుంది.
* రోడ్డు నెంబర్ నెం 36, జూబ్లీహిల్స్, మాదాపూర్‌లపై ఒత్తిడి గణనీయంగా తగ్గనుంది.
* జూబ్లీహిల్స్ నుండి మైండ్‌స్పేస్, గచ్చిబౌలిలకు దాదాపు రెండు కిలోమీటర్ల మేర దూరం తగ్గనుంది.