డ్యూటీ మైండెడ్ కలెక్టర్

Duty Minded Collector

ఆయన పేరు చెపితే ప్రభుత్వ ఉద్యోగులకు , ప్రజా ప్రతినిధులకు కూడా టెన్షన్ మొదలవుతుంది. ముక్కుసూటిగా మాట్లాడే, విధి నిర్వహణలో నిక్కచ్చిగా వ్యవహరించే ఆయనంటే అందరికీ భయమే. డ్యూటీ మైండెడ్‌గా ఉండటమే ఆ భయానికి మొదటి కారణం . అనుకున్న లక్ష్యాలు నెరవేరేలా అనుక్షణం పని చేసే విధి నిర్వహణలో తేడా వస్తే ఎవరిని వదిలిపెట్టని మోనార్క్ ఆయన . తప్పు చేస్తే సస్పెన్షన్ పేరుతో చెడుగుడు ఆడేసే ఆ యువ కలెక్టర్ పేరు వింటే ప్రజలు మాత్రం సంతోషంవ్యక్తం చేస్తారు.

యువ కలెక్టర్‌గా తనదైన స్టైల్లో దూసుకెళుతున్న రొనాల్డ్ రోస్.. తాను ఎక్కడ పనిచేసినా డ్యూటీ ముఖ్యం అంటారు. తాను పనిచేస్తూకిందిస్థాయి ఉద్యోగులతో పనిచేయిస్తారు. ఆ క్రమంలో తోక జాడిస్తే ఉద్యోగం ఊస్టింగ్ చేసేస్తారు.మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ రొనాల్డ్ రోస్ వర్కింగ్ స్టైలే వేరు. సంక్షేమ పథకాలు, వాటి అమలు తీరుపై పట్టున్న ఈ యువ కలెక్టర్ విధి నిర్వహణలో చాలా సీరియస్‌గా ఉంటారు. ప్రభుత్వ లక్ష్యాలు జనాలకు చేరే విధంగా పరితపిస్తుంటారనే పేరుంది. ఆకస్మిక తనిఖీలు చేస్తూ ప్రభుత్వ ఉద్యోగులు పనితీరును ఓ కంట కనిపెడతారు. ఆ క్రమంలో తాజాగా ఎనిమిది మంది ఉపాధ్యాయులపై వేటు వేయడం చర్చానీయాంశమైంది. జిల్లా కేంద్రంలోని మార్కెట్ రోడ్డులో ఉన్న గవర్నమెంట్ స్కూల్ టీచర్లపై కలెక్టర్ చర్యలు తీసుకున్నారు. శనివారం నాడు ఉదయం తనిఖీల్లో భాగంగా సదరు పాఠశాలకు వెళ్లారు. అయితే అక్కడ విధులు నిర్వర్తించే ఎనిమింది ఉపాధ్యాయులతో పాటు విద్యా వాలంటీర్ హాజరు కాలేదు. దాంతో వారిని సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటిస్తూ ఆ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.

ఇలా ఆకస్మిక తనిఖీలు చేయడం.. విధి నిర్వహణలో అలసత్వం ప్రదర్శించే ఉద్యోగుల పని పట్టడం రొనాల్డ్ రోస్‌కు కొత్తేమీ కాదు. గతంలో కూడా చాలా సందర్భాల్లో ఆయన నిక్కచ్చిగా వ్యవహరించారు. సమయానికి విధులకు హాజరుకాని ఉద్యోగులతో పాటు డ్యూటీలో నిర్లక్ష్యం ప్రదర్శించిన పలువుర్ని సస్పెండ్ చేసిన సందర్భాలున్నాయి. ఫిబ్రవరి చివరి వారంలో ఊట్కూర్ మండల పరిధిలోని ఐదుగురు పంచాయతీ కార్యదర్శులను సస్పెండ్ చేశారు. జిల్లా కేంద్రంలో నిర్వహించిన ఎస్‌బీఎం సమావేశానికి వారు హాజరు కాకపోవడమే దానికి కారణం. ఉన్నతాధికారుల సూచన మేరకు మీటింగ్‌కు రాకుండా డుమ్మా కొట్టారనే నెపంతో కలెక్టర్ సీరియస్ అయ్యారు. ఇలాంటి సందర్భాలు ఈ యువ కలెక్టర్ డైరీలో చాలానే ఉన్నాయి.

మెదక్, నిజామాబాద్ జిల్లాలో పనిచేసినప్పుడు కూడా రొనాల్డ్ రోస్ దూకుడుకు అక్కడి ప్రభుత్వాధికారులు, ప్రజా ప్రతినిధులు తట్టుకోలేకపోయారనే వాదనలున్నాయి. డ్యూటీ మైండెడ్‌గా ఉండే ఈ యువ కలెక్టర్ ప్రభుత్వ సిబ్బంది విధుల్లో అలసత్వం ప్రదర్శిస్తే ఏమాత్రం ఉపేక్షించబోరనే పేరుంది. నెలనెలా జీతాలు తీసుకుంటున్న ప్రభుత్వ ఉద్యోగులు కచ్చితంగా ప్రజలకు మెరుగైన సేవలు అందించాలనేది ఆయన భావనగా కనిపిస్తోంది. మొత్తానికి ఒకేసారి ఎనిమిది మంది టీచర్లను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు జిల్లావ్యాప్తంగా చర్చానీయాంశమైంది.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article