న్యూఢిల్లీ: మైనర్ బాలికపై అత్యాచారం, హత్య చేసిన కేసులో నిందితుడికి మరణ శిక్షను అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్ట్ సమర్థించింది. అత్యంత దారుణంగా మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడటంతో పాటు పాశవికంగా హత్య చేయడంపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. నేరం క్రూరమైనదని..అమానవీయమని పేర్కొంది. శారీరకంగా, మానసికంగా వికలాంగురాలైన మైనర్ బాలికను కిడ్నాప్ చేసి, అత్యాచారం, హత్య చేసిన నిందితుడు మనోజ్ ప్రతాప్ సింగ్ కు రాజస్థాన్ హైకోర్ట్ విధించిన మరణశిక్షను సుప్రీం కోర్టు ధ్రువీకరించింది.న్యాయమూర్తులు ఏఎం ఖాన్విల్కర్, దినేష్ మహేశ్వరి, సీటీ కుమార్ లతో కూడిన ధర్మాసనం మనోజ్ ప్రతాప్ సింగ్ ను దోషిగా నిర్థారిస్తూ ఉరిశిక్షను సమర్థించింది. రాజస్థాన్ హైకోర్ట్ విధించిన మరణశిక్షను సవాల్ చేసిన మనోజ్ ప్రతాప్ సింగ్ అప్పీల్ ను సుప్రీం కోర్ట్ తోసిపుచ్చింది. స్వీట్స్ కొనిస్తాననే నమ్మించి, అమాయక బాధితురాలని దొంగలించిన స్కూటర్ పై నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యంత పాశవికంగా అత్యాచారం చేసి హత్య చేసిన ఆరోపణలపై నిందితుడిపై ఐపీసీ సెక్షన్లు 363, 365, 376(2)(ఎఫ్), 302 తో పాటు పోక్సో చట్టాల కింద అభియోగాలు నమోదు అయ్యాయి. సెక్షన్ 302 ప్రకారం నిందితుడికి మరణ శిక్షను సుప్రీం కోర్టు ధ్రువీకరించింది.నిందితుడు, ఏడున్నరేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడటంతో పాటు, బాధితురాలి తలను అత్యంత దారుణంగా పగలగొట్టి చంపాడని..ముందరి ఎముకలో అనేక పగుళ్లు ఏర్పడ్డాయని.. మరణశిక్ష కన్నా తక్కువస్థాయి ఏ శిక్షకు కూడా నిందితుడు అర్హుడు కాదని సుప్రీం వ్యాఖ్యానించింది. జీవిత ఖైదు విధింపు కూడా సమర్థనీయంగా అనిపించడం లేదని సుప్రీం వ్యాఖ్యానించింది. ఈ నేరంతో పాటు గతంలో నాలుగు నేరాల్లో నిందితుడు పాలుపంచుకున్నట్లు సుప్రీం వెల్లడించింది. నిందితుడు మనోజ్ ప్రతాప్ సింగ్ , పండ్లు కూరగాయలు అమ్ముకుంటున్న తల్లిదండ్రుల దగ్గర నుంచి ఏడున్నరేళ్ల బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారం, హత్య చేశాడు.