‘F2’ Fun and Frustration Rating
`ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు`, `నువ్వు నాకు నచ్చావ్`, `మల్లీశ్వరి` వంటి కుటుంబ కథా చిత్రాల్లో తనదైన కామెడీ టైమింగ్‌తో ఆకట్టుకున్న హీరో విక్టరీ వెంకటేష్ `దృశ్యం`, `గురు` వంటి చిత్రాలతో డిఫరెంట్ సినిమాలు చేశాడు. అయితే ఈ సీనియర్ హీరో చాలా గ్యాప్ తర్వాత చేసిన ఫ్యామిలీ కామెడీ ఎంటర్‌టైనర్ ఎఫ్ 2.. ఫన్ అండ్ ఫ్రస్టేషన్. ఈయనకు తోడుగా వరుణ్ తేజ్ కూడా జత కలిశాడు. పటాస్, సుప్రీమ్, రాజాది గ్రేట్ వంటి కమర్షియల్ చిత్రాల్లో కామెడీతో మెప్పించిన అనీల్ రావిపూడి.. చాలా కాలంగా మంచి సక్సెస్ కోసం వెయిట్ చేస్తున్న ఫ్యామిలీ కథా చిత్రాల నిర్మాత దిల్‌రాజు కాంబినేషన్‌లో రూపొందిన ఫన్ ఏంటో.. ఫ్రస్టేషన్ ఏంటో తెలుసుకోవాలంటే సినిమా కథేంటో చూద్దాం…
సెన్సార్: యు/ఎ
వ్యవథి:
సమర్పణ: దిల్‌రాజు
బ్యానర్: శ‌్రీ వెంకటేశ్వర క్రియేషన్స్
తారాగణం: వెంకటేష్, వరుణ్ తేజ్, తమన్నా, మెహరీన్,రాజేంద్ర ప్రసాద్, ప్రకాష్ రాజ్, ప్రియదర్శి, అనసూయ, ఝాన్నీ, వెన్నెలకిషోర్, రఘు బాబు, వై.విజయ, అన్నపూర్ణమ్మ తదితరులు
ఎడిటింగ్: తమ్మిరాజు
ఆర్ట్: ఎ.ఎస్.ప్రకాష్
మ్యూజిక్ : దేవిశ్రీ ప్రసాద్
ఛాయాగ్రహణం: సమీర్ రెడ్డి
నిర్మాతలు: శిరీష్, లక్ష్మణ్
రచన, దర్శకత్వం: అనీల్ రావిపూడి
కథ:
ఎమ్మెల్యే పి.ఎ వెంకీ(వెంకటేష్) హారిక(తమన్నా)ను పెళ్లి చేసుకుంటాడు. ఆరు నెలలు కాపురం బాగానే సాగుతుంది. తర్వాత భార్య, భర్తల మధ్య చిన్న చిన్న గొడవలు వస్తాయి. దాంతో వెంకీ పూర్తి ఫ్రస్టేట్ అయిపోతాడు. అదే సమయంలో మరదలు హనీ(మెహరీన్) కూడా ఇంట్లోకి చేరి వెంకీని ఇంకా ఫ్రస్టేషన్‌కు గురి చేస్తుంటుంది. బోరబండ వరుణ్(వరుణ్‌తేజ్)ని హనీ ప్రేమిస్తుంది. ఆ విషయం తెలుసుకున్న వెంకీ.. ఆ సాకుగా చూపి హారిక, ఆమె కుటుంబ సభ్యులు తనను పెట్టిన ఇబ్బందులకు ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటాడు. అయితే వాళ్లు తెలివిగా వరుణ్, హనీ విషయం తమకు తెలుసునని తప్పించుకుంటారు. హనీని పెళ్లి చేసుకోవద్దని, తనలాగే కష్టాలు పడతావని వెంకీ చెప్పినా.. వరుణ్ వినిపించుకోడు. నిశ్చితార్థం అయిన వారంలోపు తల్లికి, హనీ కుటుంబ సభ్యుల మధ్య వచ్చే గొడవలతో వరుణ్ కూడా ఫ్రస్టేట్ అయిపోతాడు. వీరికి రెండు పెళ్లిళ్లు చేసుకున్న పక్కింటాయన(రాజేంద్ర ప్రసాద్) జత కలవడంతో ముగ్గురు కలిసి యూరప్ ట్రిప్‌కి వెళ్లిపోతారు. భర్తలను వెతుక్కుంటూ వచ్చిన హారిక, హనీలను వెంకీ, వరుణ్‌లు పట్టించుకోరు. దాంతో వారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? చివరకు రెండు జంటలు కలుసుకున్నాయా? లేవా అని తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే…
ప్లస్ పాయింట్స్
– నటీనటులు
– కామెడీ ప్రధానమైన సన్నివేశాలు, డైలాగ్స్
– కెమెరా
– టేకింగ్
మైనస్ పాయింట్స్ :
-రొటీన్ కథ
– దర్శకత్వం
విశ్లేషణ:
సినిమాకు ప్రధాన బలం వెంకటేష్.. తనదైన కామెడీ టైమింగ్‌తో వెంకటేష్ నవ్వించాడు. ఈ సినిమాలో వెంకీ లుక్, నటన చూస్తుంటే నువ్వునాకు నచ్చావ్ సమయంలో వెంకటేష్ గుర్తుకు వస్తాడు. భార్య వల్ల ఫ్రస్టేషన్‌కు గురయ్యే భర్తగా వెంకీ నటన.. ప్రతి సీన్‌లోనూ నవ్విస్తుంది. ఇక తెలంగాణ యాసలో వరుణ్ తేజ్ పాత్ర కూడా మెప్పిస్తుంది. గర్లఫ్రెండ్ ఇతరులను భయపెట్టేలా పాడుతున్నా.. డ్యాన్సులు చేస్తున్నా.. ఆమెను ప్రేమించే వరుణ్ ఆమెతో నిశ్చితార్థం జరిగిన తర్వాత ఆమె ప్రవర్తన వల్ల ఎలా ఫ్రస్టేట్ అయ్యాడనేది తెరపై చూడొచ్చు. వరుణ్ కూడా కామెడీ బాగా చేశాడు. తమన్నా, మెహరీన్ కామెడీ పరంగా మంచి నటనను ప్రదర్శించడమే కాదు.. గ్లామర్‌తో మెప్పించారు. ఈ రెండు జంటలు చేసే బుర్ర గిర గిరా.. అనే పాటలో మసాలా డోస్ పెరిగింది. అలాగే బికినీలు వేసి కూడా మాస్‌ను ఆకట్టుకున్నారు. యూరప్ ఎన్నారైగా ప్రకాష్ రాజ్ పాత్ర ఫన్నీగా ఉంటుంది. ఆయన గుండమ్మకథతో స్ఫూర్తి పొంది తన కొడుకులకు ఇద్దరు అక్కాచెల్లెళ్లనే పెళ్లిచేయాలనుకునే తండ్రి పాత్రలో ప్రకాష్ రాజ్ నటన మెప్పిస్తుంది. రెండు పెళ్లిళ్లు చేసుకుని ముందు ఒకరి తెలియకుండా ఒకరిని మెయిన్‌టెయిన్ చేస్తూ.. తెలియగానే తప్పించుకుని యూరప్ వచ్చేసి.. అక్కడ ఓ అమ్మాయిని లైన్‌లో పెట్టాలనుకుని.. ఆమె వల్ల ఇబ్బందులు పడే వ్యక్తిగా రాజేంద్రప్రసాద్ నటన మెప్పిస్తుంది. ఎమ్మెల్యేగా రఘుబాబు, వరుణ్ స్నేహితుడిగా ప్రియదర్శి, యూరప్‌లో తెలుగు పోలీసాఫీసర్‌గా నాజర్.. రాజేంద్ర ప్రసాద్‌ను ఇబ్బంది పెట్టే పాత్రలో హరితేజ ఇలా అందరూ వారి వారి పాత్రలకు న్యాయం చేశారు. సినిమా ప్రథమార్థం అంతా ఔట్ అండ్ ఔట్ కామెడీతో ఉంటుంది. ఇక సెకండాఫ్‌లో కాస్త కామెడీ డౌన్ అయినా పూర్తిగా సినిమా నవ్విస్తూనే ఉంటుంది. రొటీన్ కథనే అనీల్ రావిపూడి కామెడీ యాంగిల్లో చాలా చక్కగా తెరకెక్కించాడు. సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ బావుంది. దేవిశ్రీ సాంగ్స్ బాగా లేకపోయినా.. సిచ్యువేషనల్ సాంగ్స్ కాబట్టి నడిచిపోతాయి… ఇక నేపథ్య సంగీతం బాలేదు. అయితే సినిమా మొత్తంగా చూసి బాగా నవ్వుకుంటారు.
చివరగా.. ఎఫ్ 2… నవ్వుల విందు ఖాయం
రేటింగ్: 3.25/5