FARMER CENTRIC BUDGET
- రైతుబంధు తరహాలో ప్రధానమంత్రి కిసాన్ యోజన
- తెలంగాణ పథకమే స్ఫూర్తిగా కేంద్రం కొత్త పథకం
అంతా ఊహించినట్టుగానే కేంద్ర బడ్జెట్ రైతుపై వరాలు కురిపించింది. తెలంగాణలో అమలవుతున్న రైతుబంధు పథకాన్నే కేంద్ర ప్రభుత్వం కూడా ప్రవేశపెట్టింది. రాష్ట్రంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం రైతుబంధు పథకం ప్రవేశపెట్టడం ద్వారానే రెండోసారి భారీ మెజార్టీతో అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ పథకంపై కేంద్రం కూడా ఆసక్తిగా ఉందని పలు సందర్భాల్లో వార్తలు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలోనే కేంద్రం రైతుబంధు తరహాలో దేశవ్యాప్తంగా కొత్త పథకాన్ని తీసుకురానుందని ఊహాగానాలు చెలరేగాయి. కేంద్రంలో మళ్లీ అధికారం నిలబెట్టుకోవాలంటే రైతుల మద్దతు తప్పనిసరి అని భావించిన ఎన్డీఏ సర్కారు.. అన్నదాతను ప్రసన్నం చేసుకోవాలని భావించింది. ఆ మేరకే 5 ఎకరాలు లోపు ఉన్న చిన్న, సన్నకారు రైతులకు ఏడాదికి రూ.6వేలు ఇవ్వనున్నట్టు ప్రకటించింది. పైగా ఈ పథకం 2018 డిసెంబర్ నుంచే అమల్లోకి వచ్చిందని పేర్కొంది.
ఎన్నికలకు ఇక మూడు నెలల సమయం కూడా లేకపోవడం.. ఈ నెలాఖరు లేదా మార్చి మొదటివారంలో ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉండటంతో ఈ పథకం అమలును వెంటనే ప్రారంభించాలని మోడీ ప్రభుత్వం నిర్ణయించింది. అందువల్లే వెంటనే రైతుల ఖాతాల్లోకి ఈ నిధులు జమచేస్తామని లోక్ సభలో పీయూష్ గోయెల్ ప్రకటించారు. ఇందుకోసం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధికి రూ.75వేల కోట్లు కేటాయిస్తున్నట్టు తెలిపారు. అలాగే ప్రకృతి విపత్తుల వల్ల నష్టపోయినవారికి రుణాల రీషెడ్యూల్ చేస్తామని వెల్లడించారు. పాడి, మత్స్య రైతులకు రెండు శాతానికే రుణాలు ఇస్తామన్నారు.