ఫెడరల్ ఫ్రంట్ ఆశలు అడియాశలైనట్టే

74
Federal Front alliance was failed
Federal Front alliance was failed

Federal Front alliance was failed

ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ జెండా రెపరెపలాడింది. 88 స్థానాల్లో గెలిచి బంపర్ మెజార్టీ సాధించింది. ఉద్యమ ప్రస్థానంతో రాజకీయశక్తిగా ఎదిగిన టీఆర్ఎస్‌కు ఢోకా లేదని నిరూపించుకుంది. అంతవరకు బాగానే ఉన్నా.. లోక్‌సభ ఎన్నికల్లో సీన్ రివర్సయింది. సారు.. కారు.. పదహారు అంటూ క్లీన్ స్వీప్ కోసం ప్రయత్నించిన గులాబీ నేతలకు మింగుడు పడని రిజల్ట్స్ వచ్చాయి. అసెంబ్లీ ఎన్నికల్లో బంపర్ మెజార్టీ సాధించిన టీఆర్ఎస్.. లోక్‌సభ ఎన్నికల్లో బొక్కబొర్లా పడింది. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నీ తానై ఒకే ఒక్కడిగా ఉమ్మడి పదిజిల్లాల్లో రౌండేశారు. సన్నాహాక సమావేశాల పేరిట భారీ బహిరంగ సభలు నిర్వహించారు. ఎన్నికల ప్రచార వేళ టీఆర్ఎస్ ఊపు కనిపించినా.. ఫలితాలు వచ్చేసరికి మాత్రం ఘోరంగా దెబ్బతింది.
టీఆర్ఎస్ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చాక సీఎం కేసీఆర్ తనయుడు కేటీఆర్‌ను ప్రొజెక్ట్ చేసే ప్రక్రియ ఊపందుకుందనే వాదనలున్నాయి. థర్డ్ ఫ్రంట్‌తో దేశరాజకీయాల్లో కేసీఆర్ చక్రం తిప్పాలని అనుకోవడంతో ఇక్కడ కేటీఆర్‌ను సెంటర్ పాయింట్‌ చేయాలనేది ఆయన అంతరంగమనే ప్రచారం జరుగుతోంది. కేటీఆర్‌ను ముఖ్యమంత్రి చేసే క్రమంలోనే ఆయనకు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి అప్పగించారనే టాక్ నడుస్తోంది. రెండోసారి అధికారంలోకి వచ్చిన రెండు రోజులకే కేటీఆర్‌కు వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టు కట్టబెట్టారు. ఇక లోక్‌సభ ఎన్నికల వేళ కేటీఆర్ అన్నీ తానై వ్యవహరించారు. ఉమ్మడి పదిజిల్లాల్లో నిర్వహించిన సన్నాహాక సమావేశాలను ఒకే ఒక్కడిగా కేటీఆర్ నడిపించారు. ఆయా పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా టీఆర్ఎస్ నేతలకు బాధ్యతలు అప్పజెప్పి మరీ వాటిని విజయవంతం చేశారు.
సన్నాహాక సమావేశాలు ఓకే.. సారు కారు పదహారు అంటూ కేటీఆర్ మంత్రదండం ఓకే.. కానీ ఫలితాలు వచ్చిన వేళ సీన్ రివర్స్ కావడం ఆ పార్టీశ్రేణులను నిరాశకు గురిచేసింది. లోక్‌సభ ఎన్నికల కోసం టీఆర్ఎస్ అభ్యర్థుల ఎంపిక విషయంలోనూ కేటీఆర్ చక్రం తిప్పినట్లు వార్తలొచ్చాయి. పదహారు స్థానాల్లో విజయం ఖాయమంటూ ప్రతి సమావేశంలో చెప్పిన కేటీఆర్.. అందుకనుగుణంగా సక్సెస్ కాలేకపోయారనే వాదనలు వినిపిస్తున్నాయి. టీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ తర్వాత అంతటి వాక్చాతుర్యం కేటీఆర్‌కే ఉందని చెప్పొచ్చు. అలాంటిది ఈసారి లోక్‌సభ ఎన్నికల వేళ కేటీఆర్ మాట తీరు పనిచేయలేదా.. లేదంటే టీఆర్ఎస్‌పై వ్యతిరేక పవనాలు వీస్తున్నాయా అనేది చర్చానీయాంశంగా మారింది. కేసీఆర్ తర్వాత పబ్లిక్‌లో ఓ రేంజ్ ఇమేజ్ ఉన్న హరీష్ రావును ఎన్నికల ప్రచారానికి వాడుకోవడం పెద్ద మైనస్ పాయింటనే చర్చ జరుగుతోంది.
లోక్‌సభ ఎన్నికల వేళ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కేటీఆర్ ఉమ్మడి పది జిల్లాలు చుట్టొచ్చారు. పార్టీ అభ్యర్థుల విజయం కోసం విస్తృత ప్రచారం చేశారు. అయినా ఫలితాలు మాత్రం రివర్స్ అయ్యాయి. ఇక హరీష్ రావును ఎన్నికల ప్రచారానికి ఎందుకు దూరంగా పెట్టారో ఆ పార్టీ పెద్దలకే తెలియాలి అంటున్నారు పార్టీశ్రేణులు. ఆయనకు ఒక మెదక్ జిల్లా ఎంపీ అభ్యర్థిని గెలిపించే బాధ్యత అప్పజెప్పడంతో అక్కడ ఆయన పైచేయి సాధించారు. మెదక్ పార్లమెంటరీ స్థానం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి 3 లక్షలకు పైగా బంపర్ మెజార్టీతో గెలుపొందారు. దాంతో హరీష్ రావు తనకు అప్పజెప్పిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించినట్లైంది. మొదటినుంచి కూడా ట్రబుల్ షూటర్ అనే పేరున్న హరీష్ రావు మరోసారి తన సత్తా చాటినట్లైంది. హరీష్ రావు ఇమేజ్‌ను, వ్యూహాలను రాష్ట్రమంతటా వాడుకుంటే టీఆర్ఎస్‌కు ఇంతలా నష్టం జరిగి ఉండేది కాదనే అభిపాయ్రం పార్టీశ్రేణుల్లో వ్యక్తమవుతోంది.
లోక్‌సభ ఎన్నికల ఫలితాలతో టీఆర్ఎస్‌కు ఎదురుదెబ్బ తగిలినట్లైంది. అటు కేసీఆర్ కలలుగన్న థర్డ్ ఫ్రంట్ కూడా అతీగతి లేకుండా పోయిందనే ప్రచారం జరుగుతోంది. కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి వెళితే.. ఇక్కడ కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతారనే వార్తలొచ్చాయి. ఇప్పుడు సీన్ చూస్తేనేమో టోటల్ రివర్స్‌గా కనిపిస్తోంది. అటు లోక్‌సభ ఎన్నికల్లో సత్తా చాటలేక.. ఇటు థర్డ్ ఫ్రంట్ కథ ముందుకు పోలేక.. టీఆర్ఎస్ అధిష్టానం మల్లగుల్లాలు పడుతుందనే టాక్ వినిపిస్తోంది. ఇక గెలిచిన 9 మంది ఎంపీలతో ఢిల్లీలో టీఆర్ఎస్ చక్రం తిప్పే పరిస్థితి కనిపించడం లేదు. కేసీఆర్ ముఖ్యమంత్రి పీఠం వదిలి ఢిల్లీకి వెళ్లే ఛాన్స్ లేనట్లే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మరి ఈ ఐదేళ్లు కేటీఆర్ ఏం చేస్తారో అంటూ నెటిజన్లు కామెంటుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here