హైదరాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ద్విచక్ర వాహనాలు దగ్ధం అయ్యాయి. మంటల బారిన పడి బూడిద అయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక- రాష్ట్ర విపత్తు నిర్వహణ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకున్నారు. మంటలను ఆర్పివేశారు. మలక్‌పేట్ మెట్రో స్టేషన్ పార్కింగ్ స్థలంలో కొద్దిసేపటి కిందటే ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. మెట్రో స్టేషన్ కింద ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్షణాల్లో అగ్నికీలలు వ్యాపించాయి. అక్కడ పార్క్ చేసిన అయిదారు బైక్‌లు మాడి మసి అయ్యాయి. దట్టమైన పొగ ఆ ప్రదేశం మొత్తం ఆవరించింది. ఈ అగ్నిప్రమాదం చోటు చేసుకోవడానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. తొలుత దట్టమైన పొగ వెలువడిందక్కడి నుంచి ఆ తరువాత ఒక్కసారిగా భగ్గుమంటూ అగ్నికీలలు చెలరేగాయి.
చూస్తుండగానే క్షణాల్లో వ్యాప్తి చెందాయి. అక్కడ పార్క్ చేసి ఉంచి ద్విచక్ర వాహనాలకు అంటుకున్నాయి. భగభగమంటూ మండిపోయాయా బైక్‌లన్నీ కూడా. ఘాటు వాసన వెలువడింది. మెట్రో స్టేషన్‌లో ఉన్న ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు. దీన్ని చూసిన వెంటనే స్థానికులు, అటుగా వెళ్తోన్న వాహనదారులు అప్రమత్తం అయ్యారు. మలక్‌పేట్ అగ్నిమాపక- రాష్ట్ర విపత్తు నిర్వహణ సిబ్బందికి ఈ విషయాన్ని తెలియజేశారు. మెట్రో రైల్వే స్టేషన్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు.
సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు, ట్రాఫిక్ కానిస్టేబుళ్లు సంఘటన స్థలానికి చేరుకున్నారు. మంటలను ఆర్పివేశారు. మంటలను ఆర్పడానికి సిబ్బంది తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. ఈ ఘటనతో మలక్‌పేట్- దిల్‌సుఖ్‌నగర్ మార్గంలో వాహనాల రాకపోకలు స్తంభించిపోయాయి. వాహనాలు ఎటూ కదల్లేని పరిస్థితి ఏర్పడింది. ఈ మార్గంలో రాకపోకలు సాగించే ఆర్టీసీ, ఇతర ప్రైవేటు బస్సులు, ద్విచక్ర వాహనాలు, ఆటోలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ట్రాఫిక్ కానిస్టేబుళ్లు వాహనాల రాకపోకలను క్రమబద్దీకరించడంలో నిమగ్నం అయ్యారు.