సభకు గైర్హాజ‌రు.. ఆ ఐదుగురు..

Spread the love

Five MLA’s Absent First Day

తెలంగాణ రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల్లో గెలుపొందిన ఎమ్మెల్యేలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన సందర్భం రానే వచ్చింది.రెండోసారి తెలంగాణ అసెంబ్లీ కొలువుదీరింది. గురువారం ఉదయం 11 గంటల 30 నిమిషాలకు శాసనసభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. తొలుత ప్రొటెం స్పీకర్ ముంతాజ్ అహ్మ ద్ ఖాన్ అధ్యక్షతన ఎమ్మెల్యేలందరూ ప్రమాణ స్వీకారం చేశారు. 119 మందికి గాను 114 మంది సభ్యులే ప్రమాణం చేశారు. గోషామహల్ నుంచి బీజేపీ తరపున గెలిచిన రాజాసింగ్, చాంద్రాయణగుట్ట నుంచి ఎంఐఎం తరపున గెలిచిన అక్బరుద్దీన్ సహా ఐదుగురు సభ్యులు ప్రమాణస్వీకారానికి హాజరుకాలేదు.అలాగే జాఫర్ హుస్సేన్, సండ్ర వెంకటవీరయ్య, మాధవరం కృష్ణారావు కూడా గైర్హాజరయ్యారు. ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారానికి సంబంధించి ఇప్పటికే చాలా ఆలస్యమైంది. గెలిచి నెల రోజులు దాటినా ప్రమాణ స్వీకారం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూశారు. ఇక కొత్తగా గెలిచిన ఎమ్మెల్యేల యాంగ్జైటీ చెప్పనక్కర్లేదు. అదలావుంటే గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పరిస్థితి వేరు. ప్రమాణ స్వీకారోత్సవానికి దూరంగా ఉంటానని ప్రకటించారు. ప్రొటెం స్పీకర్ గా ఎంఐఎం ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ ఖాన్ కు పట్టం కట్టడమే ఆయన ఆగ్రహానికి కారణం. ముంతాజ్ ఎదుట ఎమ్మెల్యేగా తాను ప్రమాణం చేయబోను అనేది ఆయన శపథం. దీనికి సంబంధించి ఈనెల 6న ఓ వీడియోను కూడా సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేశారు రాజాసింగ్. అయితే స్పీకర్ గా పోచారం శ్రీనివాసరెడ్డి ఖరారు కావడంతో ఆయన అధ్యక్షతన రాజాసింగ్ ప్రమాణస్వీకారం చేసే అవకాశం కనిపిస్తోంది. ఇక చాంద్రాయణ గుట్ట నుంచి ఎంఐఎం ఎమ్మెల్యేగా గెలిచిన అక్బరుద్దీన్ సభకు రాకపోవడం విస్మయానికి గురిచేసింది. టీఆర్ఎస్ తో పరోక్ష పొత్తు కొనసాగించడమే గాకుండా ఎంఐఎం పార్టీకి చెందిన నేతకే ప్రొటెం స్పీకర్ గా ఛాన్స్ ఇచ్చినప్పటికీ.. అక్బరుద్దీన్ సభకు ఎందుకు రాలేకపోయారనే గుసగుసలు వినిపించాయి. అయితే ఆయన అనారోగ్య కారణాలతో సభకు రాలేకపోయారు. లండన్ లో చికిత్స తీసుకుంటుండటంతో రావడానికి వీలుపడలేదు. ఇక మాధవరం కృష్ణారావు, సండ్ర వెంకట వీరయ్య, జాఫర్ హుస్సేన్ వ్యక్తిగత కారణాలతో అసెంబ్లీకి రాలేకపోయారని సమాచారం. ఈ ఐదుగురు ఎమ్మెల్యేలు మినహాయించి మిగతా వారంతా సభలో కొలువుదీరారు. ఎమ్మెల్యేలుగా తన బాధ్యతలను నిర్వర్తిస్తామని ప్రమాణం చేశారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *