FORBES BILLIONAIRES
- ప్రపంచ కుబేరుల్లో 13వ స్థానం
- 9 లక్షల కోట్లతో తొలి స్థానంలో అమెజాన్ అధినేత
- టాప్ 100లో నలుగురే భారతీయులు
ప్రపంచ కుబేరుల జాబితాలో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ 13వ స్థానంలో నిలిచారు. గతేడాది 19వ స్థానంలో ఉన్న ఆయన ఈ ఏడాది 13వ స్థానంలోకి చేరుకున్నారు. గతేడాది ముకేశ్ ఆస్తుల విలువ 4,010 కోట్ల డాలర్ల నుంచి 5వేల కోట్ల డాలర్ల(రూ.3.5 లక్షల కోట్లు)కు చేరింది. 2017లో ముకేశ్ అంబానీ 37వ స్థానంలో ఉండగా.. 2018లో 19వ స్థానానికి, తాజాగా 13వ స్థానానికి చేరడం విశేషం. ప్రపంచవ్యాప్తంగా అత్యంత ధనవంతులతో కూడిన జాబితాను ఫోర్బ్స్ విడుదల చేసింది. 2019 ఫిబ్రవరి చివరినాటికి ఉన్న మారకపు రేట్లు, షేర్ల ధరలు ఆధారంగా నికర సంపదను లెక్కించింది. ఇందులో అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ రూ.9 లక్షల కోట్లతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. బిల్ గేట్స్ రెండో స్థానంలో, వారెన్ బఫెట్ మూడో స్థానంలో నిలిచారు. బిల్గేట్స్ సంపద 9000 కోట్ల డాలర్ల నుంచి 9650 కోట్ల డాలర్లకు చేరగా.. వారెన్ బఫెట్ సంపద 150 కోట్ల డాలర్లుపెరిగి 8250 కోట్ల డాలర్లకు చేరింది. ఫేస్బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్ బర్గ్ సంపద 900 కోట్ల డాలర్లు తగ్గింది. దీంతో ఆయన ర్యాంకు ఐదు నుంచి ఎనిమిదికి పడిపోయింది. జాబితాలో మొదటి 100 ర్యాంకుల్లో నలుగురు భారతీయులు మాత్రమే చోటు దక్కించుకున్నారు. వాళ్లలో ముకేశ్ అంబానీ ముందువరుసలో ఉండగా.. విప్రో ఛైర్మన్ అజీమ్ ప్రేమ్జీ (36వ ర్యాంకు), హెచ్సీఎల్ టెక్నాలజీస్ సహ వ్యవస్థాపకుడు శివ్ నాడార్ (82 ర్యాంకు), అర్సెల్లర్ మిట్టల్ (91) స్థానంలో ఉన్నారు.