కోకాపేటలోని ఆయన గృహం వద్ద భారీ భద్రత
బీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులపై కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ నిర్బంధాలు కొనసాగిస్తోంది. అక్రమ కేసులు, ముందస్తు అరెస్టులు, గృహ నిర్బంధాలు విధిస్తూ ప్రజల్లోకి వెళ్లకుండా అడ్డుకోవాలని చూస్తోంది. ఇందులో భాగంగా సిద్దిపేట ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నేత హరీష్ రావును పోలీసులు గృహ నిర్బంధం చేశారు. గురువారం ఉదయమే కోకాపేటలోని ఆయన నివాసం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ఇంట్లో నుంచి బయటకు రాకుండా అడ్డుకున్నారు. హరీష్ రావును కలవడానికి కూడా ఎవరినీ అనుమతించడం లేదు. ఫార్ములా-ఈ కార్ రేస్ కేసులో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గురువారం ఏసీబీ విచారణకు హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ నేతలను పోలీసులు హౌస్ అరెస్టులు చేస్తున్నారు.
కాగా, ఏసీబీ విచారణకు న్యాయవాదితో వెళ్లేందుకు హైకోర్టు అనుమతించిన విషయం తెలిసిందే. రెండు రోజుల క్రితం కేటీఆర్ వెంట న్యాయవాదిని అనుమతించకపోవడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. కేటీఆర్‌ను విచారించే ఏసీబీ కార్యాలయంలో దర్యాప్తు గదికి పకనే ఉన్న గ్రంథాలయ గదిలో న్యాయవాది ఉండేందుకు అనుమతించాలని స్పష్టం చేసింది. దర్యాప్తు ప్రక్రియను ఆడియో, వీడియో రికార్డింగ్ చేయాలన్న ప్రతిపాదన పట్ల సానుకూలంగా స్పందించలేదు.
గురువారం జరిగే విచారణ తీరును బట్టి అవసరమైతే పిటిషనర్ మళ్లీ కోర్టుకు రావచ్చని తెలిపింది. ఈ మేరకు జస్టిస్ కే లక్ష్మణ్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 6న ఏసీబీ దర్యాప్తుకు న్యాయవాదిని వెంటబెట్టుకుని వెళ్తే పోలీసులు అనుమతించకపోవడాన్ని సవాలు చేస్తూ కేటీఆర్ దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్‌పై బుధవారం భోజన విరామ సమయంలో హైకోర్టు అత్యవసర విచారణ జరిపింది.